అమరావతి: అక్టోబర్ 10 తర్వాత అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే యోచనలో ఏపీ ప్రభుత్వం వున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు గురువారం జరిగే కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు సమాచారం. ఇందుకోసం ఇప్పటికే అధికారులకు ఆదేశాలు అందాయని... అసెంబ్లీ అధికారులు ఏర్పాట్లు కూడా  చేస్తున్నట్లు సమాచారం.

కరోనా కారణంగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు గడువుకు ముందే ముగియడం ఏపీ ప్రభుత్వ వర్గాలను ఆలోచింపచేస్తోంది. ఈ నేపథ్యంలో ఒకవేళ మన వద్దా అలాంటి పరిస్ధితి ఎదురైతే ఎలా ఎదుర్కోవాలా అన్న దానిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఒకేవేళ సమావేశాలు జరిగే రోజులను కుదించాలా..? తీసుకోవాల్సిన జాగ్రతలేంటీ..? అన్న దానిపై కసరత్తు చేస్తున్నారు. 

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు అనుకున్న సమయం కన్నా ముందే వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ నెల 28వ తేదీ వరకు అసెంబ్లీని నిర్వహించాలనుకున్నా… ఇద్దరు సభ్యులకు, సిబ్బందికి పాజిటివ్‌ రావడం వల్ల స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.