Asianet News TeluguAsianet News Telugu

అమరావతిలో మరోసారి కలకలం.. ఆర్ 5 జోన్ ఏర్పాటు చేస్తూ గెజిట్ జారీ చేసిన జగన్ సర్కార్

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఆర్ 5 జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు మంగళవారం సర్కార్ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీని వల్ల రాజధాని అమరావతి ప్రాంతంలోని వారికే కాకుండా... ఇతర ప్రాంతాల వారికి కూడా ఇక్కడే ఇళ్ల స్థలాలను కేటాయించేందుకు అవకాశం లభిస్తుంది.

ap govt gazette issued for establishing r5 zone in amaravati
Author
First Published Mar 21, 2023, 9:33 PM IST

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో వైఎస్ జగన్ సర్కార్ మరోసారి అలజడి సృష్టించింది. రైతుల అభిప్రాయాన్ని పరిగణనలోనికి తీసుకోకుండా రాజధానిలో ఆర్ 5 జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు మంగళవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. మంగళగిరి మండలంలోని కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు.. తుళ్లూరు మండలంలోని మందడం, ఐనవోలు గ్రామాల పరిధిలోని 900 ఎకరాలను ఆర్ 5 జోన్ పరిధిలోకి తీసుకొచ్చింది ఏపీ ప్రభుత్వం. 

కాగా..  అమరావతిలో ఇతర ప్రాంతాల పేదలకు ఇళ్ల స్థలాలను ఉద్దేశించిన దస్త్రానికి అప్పటి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. పేదలకు స్థలాలు ఇచ్చే సీఆర్‌డీఏ, ఏపీ మెట్రోపాలిటన్ రీజియన్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చట్టాల సవరణకు గవర్నర్ అంగీకారం తెలిపారు. గతేడాది ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ఈ చట్టాలకు జగన్ ప్రభుత్వం సవరణలు ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో గవర్నర్ ఆమోదం లభించడంతో పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపుకు మార్గం సుగమమైంది. అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలను కేటాయించేలా చట్ట సవరణను చేశారు. దీని వల్ల రాజధాని అమరావతి ప్రాంతంలోని వారికే కాకుండా... ఇతర ప్రాంతాల వారికి కూడా ఇక్కడే ఇళ్ల స్థలాలను కేటాయించేందుకు అవకాశం లభిస్తుంది. ఈమేరకు రాజధాని మాస్టర్ ప్లాన్‌లో మార్పులు, చేర్పులు చేసేందుకు ప్రభుత్వానికి వెసులుబాటు కలుగుతుంది. 

అయితే దీనిపై రాజధాని ప్రాంత రైతులు భగ్గుమన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అప్పట్లోనే రైతులు హైకోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు అధికారులు గ్రామసభలు నిర్వహించారు. తాజాగా ఇప్పుడు ప్రభుత్వం ఆర్ 5 జోన్‌పై గెజిట్ జారీ చేయడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి న్యాయ పోరాటం చేయాలని వారు నిర్ణయించుకున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios