మైనింగ్ లీజుల కేటాయింపుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై హైపవర్ కమిటీ ద్వారానే గనుల లీజులు కేటాయించాలని నిర్ణయించింది.

ఈ ఆక్షన్ ద్వారా మైనింగ్ లీజులను హై పవర్ కమిటీ ద్వారా ఖరారు చేసేలా బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి వివిధ శాఖల ఉన్నతాధికారులతో హై పవర్ కమిటీని ఏర్పాటు చేసింది.

ఆర్ధిక, పరిశ్రమలు, గనుల శాఖ కార్యదర్శులతో పాటు ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్, సర్వే ఆఫ్ ఇండియాలకు చెందిన ఉన్నతాధికారులతో హై పవర్ కమిటీని ఏర్పాటు చేసింది.

మైనింగ్ లీజులు, గనుల బ్లాక్ కేటాయింపు, రిజర్వ్ ధర నిర్ధారణ, అర్హతల నిర్థారణలో ఈ హైపవర్ కమిటీ కీలకంగా వ్యవహరించనుంది. ఈ కమిటీకి ఏపీ భూ గర్భ గనుల శాఖ ఉన్నాధికారి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. గనుల కేటాయింపులో పారదర్శకత కోసం కీలక మార్పులు చేశామని సర్కార్ చెబుతోంది.