ఏపీ ప్రభుత్వంపై మరోసారి విమర్శలు గుప్పించారు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ. తనను మానసికంగా ఇబ్బంది పెట్టాలని ప్రభుత్వం చూసిందని .. కొన్ని తాబేదార్ సంఘాలు తమ గుర్తింపు రద్దు చేయాలని చూస్తున్నాయని ఆయన ఆరోపించారు. 

ఏపీ ప్రభుత్వంపై మరోసారి విమర్శలు గుప్పించారు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యలపై గవర్నర్ ను కలవడంతో ప్రభుత్వం ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిందని ఆయన ఆరోపించారు. కొన్ని తాబేదార్ సంఘాలు తమ గుర్తింపు రద్దు చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాయని సూర్యనారాయణ మండిపడ్డారు. కమర్షియల్ ట్యాక్స్ అసోసియేషన్ ను నిర్వీర్యపరచాలని ప్రభుత్వం చూస్తోందని ఆయన ఆరోపించారు. ఉద్యోగులను సస్పెండ్ చేయడం ద్వారా భయపెట్టాలని చూసిందని.. తనను మానసికంగా ఇబ్బంది పెట్టాలని ప్రభుత్వం చూసిందని సూర్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

వాణిజ్య పన్నులశాఖ పునర్వ్యవస్థీకరణ అంతా గందరగోళం చేశారని.. రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ చేసి శాఖ పునర్వ్యవస్థీకరణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కొంతమంది అధికారుల కోసం ఇష్టానుసారం శాఖ విభజన చేశారని సూర్యనారాయణ దుయ్యబట్టారు. క్రమశిక్షణ చర్యల పేరుతో ఉద్యోగులను ప్రభుత్వం సస్పెండ్ చేస్తూ ఇబ్బంది పెడుతోందని.. శాఖలో అవకతవకలపై లోకాయుక్త తో విచారణ జరపాలని తీర్మానం చేసినట్లు సూర్యనారాయణ తెలిపారు. 

ALso REad: నన్నే ఓడించలేకపోయారు.. ఇక జగన్‌నేం ఓడిస్తారు, నేను సీఎం బంటునే : ఉద్యోగ నేత వెంకట్రామిరెడ్డి

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కార్ రావు మాట్లాడుతూ.. బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు,వెంకట్రామి రెడ్డి సంఘాలపై పరోక్ష విమర్శలు చేశారు. ప్రభుత్వం కొన్ని సంఘాలను ఎంటర్టైన్ చేస్తోందన్నారు. జేఏసీ అనే పేరు చట్టప్రకారం లేకపోయినా ఆయా సంఘాలను పిలుస్తోందని ఆస్కార్ రావు మండిపడ్డారు. సమస్యలు అడిగేవారు ప్రభుత్వానికి చేదు అయ్యారని.. ఎంతోమంది ఐఏఎస్‌లు వస్తారు, పోతారని ఆయన వ్యాఖ్యానించారు. అధికారులు ఏం చేస్తారు..ఏం పీకుతారని ఆస్కార్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమది మీ మోచేతి నీళ్లు తాగే సంఘం కాదని ఆయన తేల్చిచెప్పారు.