రివర్స్ పీఆర్సీ (reverse prc) ఇచ్చారంటూ గుంటూరులో ఉద్యోగులు వెనక్కు నడిచి ఆందోళన వ్యక్తం చేశారు. గుంటూరు కలెక్టరేట్ వద్ద జరిగిన ఆందోళనల్లో జనవరి నెలకు సంబంధించి తమకు పాత వేతనాలే ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. 

ఏపీ ప్రభుత్వం (ap govt) ప్రకటించిన పీఆర్సీతో (prc) ఉద్యోగులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నసంగతి తెలిసిందే. పీఆర్సీ జీవోలు ఉపసంహరించుకోవాలని ఉద్యోగ సంఘాలు గత కొన్ని రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు. పీఆర్సీ అమలు చేసి తీరుతామని ప్రభుత్వం.. తమకు పాత జీతాలే కావాలని ఉద్యోగులు పట్టుదలగా వున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఫిబ్రవరి 3న లక్ష మందితో ఛలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చారు ఉద్యోగులు. ఆ వెంటనే ఫిబ్రవరి 7 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు ఇప్పటికే నోటీసు ఇచ్చారు. ఈ క్రమంలో రివర్స్ పీఆర్సీ (reverse prc) ఇచ్చారంటూ గుంటూరులో ఉద్యోగులు వెనక్కు నడిచి ఆందోళన వ్యక్తం చేశారు. గుంటూరు కలెక్టరేట్ వద్ద జరిగిన ఆందోళనల్లో జనవరి నెలకు సంబంధించి తమకు పాత వేతనాలే ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. 

ఆదివారం పీఆర్సీ సాధన సమితి నేత వెంకట్రామిరెడ్డి (venkatrami reddy) కర్నూలులో ఉద్యోగులు చేపట్టిన ఆందోళనల్లో పాల్గొన్నారు. కమిటీ 30 శాతం పీఆర్సీని సిఫార్సు చేస్తే.. కేవలం 23 శాతమే ప్రకటించడమేంటని ప్రభుత్వంపై వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. అటు ఉద్యోగులకు ఇంత తక్కువ వేతనాలు ఇవ్వడం అన్యాయమని.. కొత్త వేతనాలు ప్రాసెస్ చేయాలని ట్రెజరీ ఉద్యోగుల్ని ఒత్తిడి చేయడం తగదన్నారు ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు (bopparaju venkateswarlu) . శ్రీకాకుళంలో ఏపీ ఎన్జీవో హోం దగ్గర జరిగిన ఉద్యోగుల నిరాహారదీక్ష శిబిరాన్ని ఆయన పరిశీలించారు. ఉమ్మడి కార్యాచరణలో భాగంగా అన్ని జిల్లాల్లోనూ ఉద్యమం సాగుతోందని బొప్పరాజు తెలిపారు. నాలుగు జేఏసీలు న్యాయమైన పోరాటం చేస్తున్నాయని... ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 

నిన్న బొప్పరాజు మీడియాతో మాట్లాడుత.. ఫిబ్రవరి 3న లక్షలాదిమందితో నిర్వహించే చలో విజయవాడను విజయంతం చేయాలని ఏపిలుపునిచ్చారు. చలో విజయవాడ కార్యక్రమం చూసైనా ప్రభుత్వం మారాలని హితవు పలికారు. మెరుగైన పీఆర్సీ (prc) కోసం ఐక్య ఉద్యమ కార్యాచరణ ప్రకటించామని బొప్పరాజు తెలిపారు. గత మూడు రోజులు నుండి రాష్ట్రవ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నామన్నారు. కార్మిక, ఉపాధ్యాయులు, పెన్షనర్లను జాగృతం చేసి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తామన్నారు.

మూడేళ్లు తిరిగాం, ఇంకా మోసం చేయొద్దు అన్నారు. ధర్మబద్ధంగా, న్యాయ బద్దంగా ఈ పోరాటం చేస్తున్నామని... మా జీతాల్లో కోతలు వేసుకుని ఆ డబ్బులు మిగుల్చుకుంటున్నారంటూ బొప్పరాజు ఆరోపించారు. చిత్తశుద్ధితో, నిజాయితీతో ఒక అడుగు ముందుకు వస్తే మేము నాలుగు అడుగులు ముందుకి వేస్తామని తెలిపారు. ఉద్యోగులకు, ప్రభుత్వానికి మధ్య ఘర్షణ వాతావరణం తీసుకు రావొద్దని బొప్పరాజు విజ్ఞప్తి చేశారు. మంత్రులు తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎస్మా చట్టానికి (esma act) భయపడేది లేదని, ప్రభుత్వం దిగొచ్చే వరకు పోరాడతామని బొప్పరాజు వెంకటేశ్వర్లు తేల్చి చెప్పారు.

మీకు భారంగా ఉన్న 10 వేల కోట్లు దాచి, మా పాత జీతాలు మాకు ఇవ్వాలని వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. రూ.1800 కోట్ల సప్లిమెంట్రీ బిల్లులు, రూ.2100 కోట్ల బకాయి బిల్లులు వెంటనే చెల్లించాలని ఆయన కోరారు. సీపీఎస్, పెన్షనర్లకు రావాల్సిన 5 వేల కోట్లు పెండింగ్ లో ఉన్నాయని, వాటిని వెంటనే ఇప్పించాలని కోరారు. 25 కోట్ల హెల్త్ బకాయిలు చెల్లించాలని బొప్పరాజు డిమాండ్ చేశారు. అన్ని విధాల సిద్ధమై ఉద్యమంలోకి దిగామని, ఎవరికీ భయపడేది లేదన్నారు.