అమరావతి భవనాల నిర్మాణంపై సీఎస్ నేతృత్వంలోని కమిటీ భేటీ అయ్యింది. శాసన రాజధానికి సంబంధించిన అసంపూర్తి భవనాల నిర్మాణంపై చర్చించింది. ఈ భవనాలు పూర్తి చేయడానికి ఎన్ని నిధులు అవసరమవుతాయన్న దానిపై సమీక్ష జరిపింది కమిటీ.

మొత్తంగా అసంపూర్తిగా భవనాల నిర్మాణానికి 2,154 కోట్లు అవసరమని అంచనా వేసింది. ప్రస్తుతం కాంట్రాక్టర్ల చెల్లింపుల నిమిత్తం రూ.300 కోట్లు అవసరమని భావిస్తోంది కమిటీ.

అసంపూర్తి నిర్మాణాలు , నిధుల సమీకరణ కోసం బ్యాంకర్లు, కాంట్రాక్టర్లతో సమావేశమవ్వాలని ఏఎంఆర్‌డీఏని కమిటీ ఆదేశించింది. 70 శాతానికి పైగా పూర్తయిన భవనాల నిర్మాణాన్ని పూర్తి చేయాలని అభిప్రాయపడింది కమిటీ. మార్చి రెండో వారంలో రెండోసారి భేటీ కావాలని నిర్ణయించింది.

సీఎస్ నేతృత్వంలో నిన్నటి నుంచి 9 మంది సభ్యులతో కమిటీ వేసిన సంగతి తెలిసిందే. అమరావతి పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలు, నివాస భవనాలు, బంగ్లాలు తదితరాల నిర్మాణంపై అధ్యయనం చేయాలని ప్రభుత్వం పేర్కొంది.

ప్రస్తుతమున్న నిర్మాణాలను పూర్తి చేయాలా? ప్రభుత్వ ఖజనానాపై భారం తగ్గించేలా ప్రత్యామ్నాయ విధానాన్ని అనుసరించాలా? అనే అంశాలపై నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించింది. అన్ని భవనాలను అధ్యయనం చేసి వాటిలో ఏవి అవసరమో కాదో కమిటీ తేల్చనుంది.