అమరావతి: ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ కార్పొ రేషన్ లీజుకు తీసుకున్న అసైన్డ్ భూములను సౌర విద్యుదుత్పత్తికి  వినియోగించుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ ల్యాండ్స్ బదలాయింపుల నిషేధ చట్టానికి సవరణ చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఆర్డినెన్స్ జారీ చేసింది. 

లీజు భూములను వ్యవసాయేతర పనులకు వినియోగించుకునేలా చట్టానికి సవరణ చేసినట్లు ఆర్డినెన్స్ లో పేర్కొంది. దీనిని ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ ల్యాండ్స్ (ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్డ్స్) అమెండ్ మెంట్ ఆర్డినెన్స్ - 2020 అని వ్యవహరిస్తారు. ప్రస్తుతం చట్టసభల సమావేశం లేనందున ఆర్డినెన్స్ జారీకి గవర్నరు ఆమోదం తెలిపారు . దీంతో న్యాయ శాఖ మంగళవారం ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. 

ఇప్పటికే రాజధాని అమరావతి ప్రాంతంలోని అసైన్డ్ భూముల విషయంలో జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అసైన్డ్‌ భూముల కొనుగోళ్లను రద్దు చేయడంతో పాటు రిటర్నబుల్ ఫ్లాట్లను కూడా రద్దు చేస్తూ గతంలోనే మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. సీఆర్‌డీఏ పరిధిలో మొత్తం 2,500 ఎకరాల అసైన్డ్ భూములు ఉన్నాయి. ఈ భూముల అసలు యజమానులకే ప్రయోజనాలు దక్కుతాయని కేబినెట్ తెలిపింది.

 అసైన్డ్ భూముల వ్యవహారంలో గత టీడీపీ ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు లబ్ధి పొందారని సర్కార్ అనుమానం వ్యక్తం చేస్తోంది. థర్డ్ పార్టీ కొనుగోళ్ల రద్దుతో అక్రమాలకు చెక్ పెట్టడంలో భాగంగా జగన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో అసైన్డ్ భూముల యాజమాన్య హక్కులను దళిత రైతులకు తిరిగి దక్కనున్నాయి. ల్యాండ్ పూలింగ్ లబ్ధి దళిత రైతులకు అందాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారంలోకి వచ్చిన మొదట్లోనే జగన్ సర్కార్ వెల్లడించింది.