ఉత్తరాంధ్రలో సీఎం క్యాంప్ కార్యాలయం.. వేగంగా ఏర్పాట్లు, కమిటీని నియమించిన ప్రభుత్వం
విశాఖలో సీఎం క్యాంప్ కార్యాలయం ఏర్పాటుపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. దీనిలో భాగంగా ప్రత్యేక కమిటీని నియమిస్తూ సీఎం జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ త్వరలో విశాఖ నుంచి పరిపాలన సాగిస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో అక్కడ ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు, వసతి సౌకర్యాలపై అధికారులు దృష్టి సారించారు. తాజాగా విశాఖలో సీఎం క్యాంప్ కార్యాలయం, మంత్రులకు వసతిపై ఏపీ ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు బుధవారం సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. విశాఖలో సీఎం క్యాంప్ ఆఫీసు గుర్తింపునకు పురపాలక, ఆర్ధిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులతో కమిటీని ఏర్పాటు చేశారు.
కాగా.. ఈ నెల 23న విశాఖలో సీఎం జగన్ కొత్త ఇంట్లో గృహ ప్రవేశం చేస్తారని వార్తలు వస్తున్నాయి. అలాగే ఇటీవల జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సందర్భంగా తాను త్వరలో విశాఖకు మకాం మారుస్తానని.. ఇక్కడి నుంచే పరిపాలన సాగిస్తానని జగన్ వెల్లడించారు. ఆ తర్వాతి నుంచి అధికారులు కార్యాచరణ ప్రారంభించారు. సీఎం క్యాంప్ కార్యాలయంతో పాటు ప్రభుత్వ కార్యాలయాల గుర్తింపు, ఉద్యోగుల తరలింపుపై దృష్టి సారించారు. ఈ క్రమంలో ఇటీవల పలుమార్లు జగన్ మాట్లాడుతూ విజయదశమికి తాను విశాఖ నుంచే పాలన సాగిస్తానని తెలిపారు.
Also Read: సీఎం పేషీ కోసం.. రుషికొండపై వేగంగా కొనసాగుతున్న పనులు..!
ఇందుకు సమయం దగ్గర పడుతుండటంతో పనులు ఊపందుకున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ డీఈసీ ఆధ్వర్యంలో అత్యంత వేగంగా , నాణ్యతతో పనులు జరుగుతున్నాయి. అక్టోబర్ 15 నాటికి సీఎం ఇంటి పనులు పూర్తి చేసి సెక్యూరిటీ విభాగానికి అప్పగించాల్సి వుంటుంది. ప్రస్తుతం ఇంటీరియర్ పనులు, డోర్స్ , ఫినిషింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. అక్టోబర్ 20 నాటికి నిర్మాణ సంస్థ పనులు పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పగిస్తామని చెబుతోంది.