అమరావతి: కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అన్‌లాక్ 4 మార్గదర్శకాలను ఏపీ సర్కార్ జారీ చేసింది. ఆ మేరకు విద్యా సంస్థలు ఈ నెల 30 వరకు బంద్ కొనసాగనుంది. సెప్టెంబర్ 21 నుండి 9,10, ఇంటర్ విద్యార్థులు స్కూల్స్‌కు వెళ్లేందుకు అనుమతినిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఇందుకు తల్లిదండ్రుల రాత పూర్వక అంగీకారం తప్పనిసరిగా ప్రభుత్వం పేర్కొంది. 

స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌లకు 21 నుండి అనుమతి ఇవ్వనుంది. అలాగే పీహెచ్‌డీ, పీజీ విద్యార్థులకు అనుమతిని ఇస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది. సెప్టెంబర్ 21 నుండి 100 మందికి మించకుండా సామాజిక, విద్య, స్పోర్ట్స్, మత పరమైన, పొలిటికల్ సమావేశాలకు అనుమతినిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. 

ఇక సెప్టెంబర్ 20 నుండి పెళ్ళిలకు 50 మంది అతిథులతో అనుమతినిచ్చింది. అలాగే  అంతక్రియలకు 20 మందికి అనుమతినిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్టైన్మెంట్ పార్క్‌లకు మాత్రం ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. సెప్టెంబర్ 21 నుండి ఓపెన్ ఏర్ థియేటర్స్‌కు అనుమతినిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 

read more   కరోనా పేరిట ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీపై.... ఏపీ హైకోర్టులో పిల్

ఇదిలావుంటే మరోవైపు ఏపీలో కరోనా కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 10,794 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 4,98,125కి చేరుకొన్నాయి.గత 24 గంటల్లో 68 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,417కి చేరుకొన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 99,689 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా సోకి కోలుకొన్న వారి సంఖ్య రాష్ట్రంలో 3,94,019కి చేరుకొంది.

గత 24 గంటల్లో అనంతపురంలో 753, చిత్తూరులో 927,తూర్పుగోదావరిలో 1244,గుంటూరులో703, కడపలో904,కృష్ణాలో457,కర్నూల్ లో380, నెల్లూరులో 1299, ప్రకాశంలో 1042, శ్రీకాకుళంలో 818, విశాఖపట్టణంలో 573, విజయనగరంలో 593, పశ్చిమగోదావరిలో 1101 కేసులు నమోదయ్యాయి.

గత 24 గంటల్లో చిత్తూరులో 9 మంది, అనంతపురం, గుంటూరులలో 8 మంది మరణించారు.. కడపలో ఏడుగురు, తూర్పుగోదావరి, విశాఖపట్టణం, పశ్చిమగోదావరిలలో ఐదుగురు, కృష్ణ, కర్నూల్, నెల్లూరులలో నలుగురి చొప్పున మరణించారు. శ్రీకాకుళంలో ఇద్దరు, విజయనగరంలో ఒక్కరు మరణించారు.