ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై మరోసారి సమరానికి సై అంటోంది. సుప్రీం కోర్టులో ఏపీ విభజన చట్టంపై కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్‌కు కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకొంది. కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్‌లో అన్నీ తప్పుడు లెక్కలే ఉన్నాయని ఏపీ సర్కార్ ఆరోపిస్తోంది.

అమరావతి: ఏపీ విభజన హమీ చట్టం ప్రకారంగా అన్నింటిని అమలు చేసినట్టుగా కేంద్రప్రభుత్వం సుప్రీం కోర్టులో బుధవారం నాడు అఫిడవిట్ దాఖలు చేయడంపై ఏపీ సర్కార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.ఈ అఫిడవిట్‌కు వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని నిర్ణయం తీసుకొంది.

కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌‌ అంతా తప్పుల తడకగా ఉందని ఏపీ ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. కేంద్ర ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి ఇది నిదర్శనమని ఏపీ ప్రభుత్వ పెద్దలు అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు ఏపీ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు గురువారం నాడు మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు.

ఏపీ రాష్ట్రానికి అన్ని రకాల హమీలను అమలు చేశామని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌‌పై యనమల రామకృష్ణుడు తప్పుబట్టారు. అన్ని అబద్దాలను ఆ అఫిడవిట్‌లో చేర్చారని ఆయన ఆరోపించారు. ఏపీ రాష్ట్రానికి అన్ని హమీలను అమలు చేశామని చెప్పడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ అఫిడవిట్‌కు కౌంటర్ దాఖలు చేస్తామని ఆయన ప్రకటించారు.

తప్పుడు లెక్కలతో సుప్రీంకోర్టును కేంద్రం తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిందని యనమల అభిప్రాయపడ్డారు. ఆర్ధికలోటు విషయమై ఈ అఫిడవిట్‌లో కేంద్రం ఎందుకు నోరు మెదపలేదని ఆయన ప్రశ్నించారు. కేంద్రం ఏ రకంగా సుప్రీంకోర్టును మోసం చేసిందనే విషయాలను కౌంటర్ అఫిడవిట్‌లో ప్రస్తావిస్తామని యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు.