అమరావతి:రైతు సంక్షేమం దిశగా ఏపీలో  జగన్ పాలన ఉంటుందని జ్యోతిష్య పండితులు సోమయాజులు చెప్పారు.మంగళవారం నాడు ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో సీఎం జగన్ పాల్గొన్నారు. క్యాంప్ కార్యాలయంలో ఈ వేడుకలు నిర్వహించారు. కప్పగంతుల సుబ్బరామ సోమయాజులు ఆధ్వర్యంలో పంచాంగ పఠనం నిర్వహించారు. 

సీఎం జగన్ పట్ల ప్రజల్లో మన్ననలు ఇంకా పెరుగుతాయని  జ్యోతిష్య పండితులు చెప్పారు. గత ఏడాది కంటే ఈ ఏడాది ఆర్ధికంగా బలపడతారన్నారు. ఈ ఏడాది వర్షాలు సమృద్దిగా కురుస్తాయని సోమయాజులు చెప్పారు.విద్య విధానాల్లో కొత్త మార్పులు వస్తాయన్నారు. ఈ ఏడాదిలో సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు చేస్తారని  చెప్పారు. పాడిపరిశ్రమ అభివృద్ది చెందుతోందని తెలిపారు.వ్యాపారం, వ్యవసాయం అభివృద్ది చెందుతోందన్నారు. 

సీఎం జగన్ కు గురు బలం బాగున్నందున అందరి మన్ననలు పొందే అవకాశం ఉందని సోమయాజులు తెలిపారు. పంచాంగ శ్రవణం తర్వాత పలువురు జ్యోతిష్య పండితులను సీఎం జగన్ సన్మానించారు. ఈ సందర్భంగా  సీఎం జగన్ మాట్లాడుతూ ఈ ఏడాది  మంచి సంవత్సరంగా అవుతోందని జ్యోతిష్య పండితులు చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసి  రైతులు సుఖ సంతోషాలతో జీవించాలని ఆయన కోరారు.