అమరావతి  భూములు కార్పోరేట్ సంస్థలకు అప్పగింత  రైతులకు మాత్రం ఇంతవరక ప్లాట్లు ఇవ్వని ప్రభుత్వం


అమరావతిలో భూముల కోసం కార్పోరేట్ సంస్థలు సీఆర్‌డీఏ వద్ద క్యూ కడుతున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకు బడా కంపెనీలపై ఉన్న మోజును మరోసారి బైటపెట్టుకున్నారు.రాజధాని నిర్మాణం కోసం భూములు అప్పగించిన రైతులకు ఇంతవరకూ ప్లాట్లు ఇవ్వకపోగా, ప్రైవేటు సంస్థలకు మాత్రం అడిగిందే తడవుగా భూములిస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. అభివృద్ది పేరుతో భూములను ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేయడంపై ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా,అక్కడ్నుంచి సమాదానం మాత్రం రావడం లేదు. 
 రాజధాని భూముల కేటాయింపు విషయంలో వారికి అనుకూల నిర్ణయాలు తీసుకుంటు, మరోసారి తాను కార్పోరేట్ సీఎంనే అని ఋజువు చేసారు చంద్రబాబు. ఆయనకున్న మోజును గమనించి కంపెనీలు కూడా తమ పైరవీలతో సీఎంను ప్రసన్నం చేసుకుని విలువైన భూములు పొందేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసారు.
ఇప్పటికే కొన్ని ప్రైవేటు సంస్థలకు వందలాది ఎకరాలు కట్టబెట్టిన సర్కారు, మరికొన్ని సంస్థలకు అదేదారిలో భూములిచ్చేందుకు సిద్ధమవుతోంది.
గీతం యూనివర్సిటీ,అమిటీ యూనివర్సిటీ , బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రి, ఏపీ ఎన్‌ఆర్‌టీ, ఎర్నెస్ట్‌ అండ్‌ ఎంగ్, ఎక్స్‌ట్రీమ్‌ ప్రాజెక్ట్స్, ఇండ్‌ రాయల్‌ హోటల్స్‌ వంటి పలు సంస్థలు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాయి. వీటికి భూములిచ్చేందుకు సీఆర్‌డీఏ సూచనప్రాయంగా అంగీకారం తెలిపింది. 
తొలుత ప్రైవేటు విద్యా సంస్థలకు భూములు కేటాయించిన ప్రభుత్వం, మరికొన్ని విద్యా సంస్థలకు ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. అలాగే హోటళ్లు, ఆస్పత్రులు, రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు కూడా భూములు పొందేందుకు ప్రభుత్వ పెద్దల ద్వారా ప్రయత్నిస్తున్నారు.
 అభివృద్ది అవసరమే అయినా, ఆ పేరుతో విలువైన భూములు ప్రైవేట్ సంస్థలకు కేటాయించడంపై వియర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా బడా సంస్థలపై ప్రభుత్వానికున్న ప్రేమ, ప్రజలపై ఉంటే బాగుంటుందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.