అమరావతి: అసెంబ్లీలో స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు. మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా తమ గొంతు నొక్కుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ పై మీడియాతో మాట్లాడిన చంద్రబాబు ముగ్గురు డిప్యూటీ లీడర్లను సస్పెండ్ చేయడం దారుణమన్నారు. తెలుగుదేశం పార్టీని డీ మోరలైజ్ చేయాలని ఉద్దేశంతోనే తమ సభ్యులను సస్పెండ్ చేశారంటూ చంద్రబాబు ఆరోపించారు.  

అసెంబ్లీలో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వమని స్పీకర్ ను పదేపదే కోరినా కనీసం స్పందించడం లేదన్నారు. తమ డిమాండ్స్ వినాలని స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి బ్రతిమిలాడుతున్నా మైక్ ఇవ్వడం లేదని చంద్రబాబు ఆరోపించారు. తనకు మైక్ ఇస్తున్నట్లే ఇచ్చి మధ్యలో కట్ చేసి అధికార పక్షానికి ఇస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. 

అసెంబ్లీలో స్పీకర్ ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఇది సరైన విధానం కాదని చంద్రబాబు సూచించారు. అకారణంగా తమ సభ్యులను సస్పెండ్ చేసినట్లు చెప్పుకొచ్చారు. సస్పెన్షన్ పై అంతా కలిసి వెళ్లి స్పీకర్ ను కలిశారని, ఎలాంటి తప్పుడు చేయని అచ్చెన్నాయుడును ఎలా సస్పెండ్ చేస్తారని ప్రశ్నించినట్లు చంద్రబాబు తెలిపారు. 

పోడియం దగ్గరకు అచ్చెన్నాయుడు రాకపోయినప్పటికీ ఆయనపై సస్పెన్షన్ వేటు వేయడం దుర్మార్గమన్నారు. అసెంబ్లీ తీరు చూస్తుంటే పులివెందుల పంచాయితీని తలపిస్తోందంటూ ఆరోపించారు.  

అసెంబ్లీని జగన్ శాసిస్తుంటే స్పీకర్ తూచ తప్పకుండా పాటిస్తాడని ఇదొక పులివెందుల పంచాయితీ అంటూ అభిప్రాయపడ్డారు. అసెంబ్లీలో టీడీపీ సభ్యులను ఎవరు తిట్టాలో ఎన్ని తిట్టాలో అన్ని వాళ్లే నిర్ణయించుకుంటారని తమకు మాత్రం మైకు ఇవ్వరన్నారు. ఇచ్చినా మధ్యలో  కట్ చేస్తారని ఆరోపించారు.  

ఏ తప్పు చేయని బీసీ శాసన సభ్యుడిని సస్పెండ్ చేసి బీసీ బిల్లుపెట్టి బీసీలందరికీ న్యాయం చేస్తామని చెప్పడం సరికాదన్నారు. అసెంబ్లీలో బిల్లులు పెడుతుంటే టీడీపీ అడ్డుతగులుతుందనే అపవాదు వేసేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అసెంబ్లీలో గతంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా ఇచ్చిన హామీని అమలు చేయండి అని ప్రశ్నించామని అది తప్పా అని నిలదీశారు. హామీ అమలు చేయండి అని చెప్పడం ప్రతిపక్షంగా అది తమ బాధ్యత అంటూ చెప్పుకొచ్చారు.   

మరోవైపు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో రాజకీయ వేధింపులు ఎక్కువ అవుతున్నాయని చంద్రబాబు ఆరోపించారు. ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అనుచరుల వేధింపులు తాళలేక మాజీ ఎంపీటీసీ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

అలాగే కడప జిల్లాలో ఓ ఉద్యోగిని రాజీనామా చేయాలంటూ ఒత్తిడి చేయడంతో అతను కూడా ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడని చంద్రబాబు చెప్పుకొచ్చారు. మరోవైపు ఆశాకార్యకర్త వెంకటరమణ ఆత్మహత్యాయత్నం కూడా రాజకీయ వేధింపుల్లో కారణమేనని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. 

ఈ వార్తలు కూడా చదవండి

 అమరావతిని చంపేశారు, రాష్ట్రాన్ని అడ్డంగా నరికేస్తున్నారు : చంద్రబాబు ఆవేదన