అమరావతి: అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేల సస్పెన్షన్ వేటుపై కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు. అసెంబ్లీ నుంచి బీసీ ఎమ్మెల్యేను సస్పెండ్‌ చేసి బీసీలకు న్యాయం చేస్తామని ఎలా చెప్తారంటూ వైసీపీపై మండిపడ్డారు.  

వైసీపీ ప్రభుత్వంలో స్పీకర్ కూడా హెల్ప్‌లెస్ అయిపోయారని చంద్రబాబు విమర్శించారు. సభాపతి ఇరు పార్టీల మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేయట్లేదని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. విప్‌లు కూడా ఆ ప్రయత్నం చేయడం లేదని విమర్శించారు. 

తాము మాట్లాడదాం అనుకున్నా స్పీకర్ సమయం ఇవ్వడం లేదని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలనుకున్నాం కానీ సలహాలు ఇచ్చేందుకు కూడా అవకాశం ఇవ్వకపోతే ఎలా అంటూ చంద్రబాబు నిలదీశారు. 

వైసీపీ పాలనతో రాష్ట్రంలో అలజడి మొదలైందన్న చంద్రబాబు ప్రభుత్వ వ్యవహారాలపై అన్ని వర్గాల ప్రజల్లో చర్చ జరుగుతోందని స్పష్టం చేశారు. పులివెందుల తరహా పాలనపై ప్రజల్లో భయం మొదలైందని ఆరోపించారు. 

బురదజల్లే ప్రయత్నంలో రాష్ట్రాన్ని అడ్డంగా నరికేస్తున్నారని, తన సీట్లోనే ఉన్న అచ్చెన్నాయుడిని ఎందుకు సస్పెండ్‌ చేశారని చంద్రబాబు ప్రశ్నించారు. ముగ్గురు డిప్యూటీ లీడర్లను సస్పెండ్‌ చేయడం సరికాదని చంద్రబాబు సూచించారు.