ఈఎస్ఐ స్కాంలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడును మరోసారి విచారించేందుకు గాను ఏసీబీ అధికారులు కోర్టులో పిటిషన్ వేసే అవకాశం కనిపిస్తోంది.

అచ్చెన్నాయుడు బెయిల్‌పై బయటికి వెళ్తే సాక్షులను ప్రలోభ పెట్టే అవకాశం వుందని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు బెయిల్ ఇవ్వకుండా ఏసీబీ కస్టడీకి ఇవ్వాలని కోరే అవకాశం వున్నట్లుగా తెలుస్తోంది.

Also Read:అచ్చెన్న అరెస్టుపై నిరసన.. దేవినేని ఉమ హౌస్ అరెస్ట్..

మొన్న 3 రోజుల విచారణలో ఏసిబి అధికారులకు సరిగ్గా సహకరించలేదని, అసలు విషయాలు దాటవేస్తూ విచారణకు సహకరించలేదని ఏసీబీ అధికారులు ఏసీబీ కోర్ట్ కి తెలిపే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

మరోవైపు ఈఎస్ఐ స్కామ్‌లో ఏసీబీ విచారణ కొనసాగుతోంది. ఈ కుంభకోణానికి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో మరికొంతమందిని అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఏపీ సచివాలయ ఉద్యోగుల పాత్రపై విచారణ కొనసాగిస్తున్నారు.

కాగా అచ్చెన్నాయుడు గుంటూరు ప్రభుత్వాసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఏసీబీ అధికారులు ఆయనను నేరుగా సబ్‌జైలుకు తరలించారు. భారీ బందోబస్తు మధ్య ప్రత్యేక అంబులెన్సులో అచ్చెన్నాయుడిని జైలుకు తీసుకెళ్లారు.

Also Read:జీజీహెచ్ నుంచి అచ్చెన్నాయుడు డిశ్చార్జ్.. సబ్‌జైలుకు తరలింపు, 3న బెయిల్‌పై తీర్పు

అయితే కోవిడ్ టెస్ట్ చేశాక, నివేదిక వచ్చిన తర్వాత మాత్రమే డిశ్చార్జ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు అచ్చెన్నాయుడి బెయిల్ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగాలేదని అచ్చెన్న తరుపు న్యాయవాది వాదించారు.

కోర్టులో ఎప్పుడు విచారణకు పిలిచినా హాజరవుతారని చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న ఏసీబీ కోర్టు తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. ఈ నెల 3న న్యాయస్థానం తమ నిర్ణయాన్ని వెల్లడించనుంది