టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు. బాబు అంతటి నీచ రాజకీయ నాయకుడు ఎవరూ లేరని, ఎన్ని గుళ్లకు తిరిగినా ఆయన పాపాలు పోవని ఆయన వ్యాఖ్యానించారు.

శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... 19-10-2017న పంటపాడుతో రథం దగ్థమైందని వెల్లంపల్లి గుర్తుచేశారు. ఈ ఘటనపై నాడు చంద్రబాబు, బీజేపీ, జనసేన ప్రశ్నించలేదు. అంతర్వేది ఘటనను ప్రతిపక్షాలు కావాలనే రాజకీయం చేస్తున్నాయని ఆయన ఎద్దేవా చేశారు.

సోషల్ మీడియాలో చంద్రబాబు దుష్ప్రచారాన్ని నమ్మొద్దని శ్రీనివాసరావు హితవు పలికారు. రాష్ట్రంలో అలజడులు సృష్టించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తున్నారని వెల్లంపల్లి ఆరోపించారు.

అంతర్వేది ఘటనను సీబీఐకి అప్పగించినా కఠిన చర్యలు తప్పవని.. 40 దేవాలయాలను కూల్చేసిన చరిత్ర చంద్రబాబుదని శ్రీనివాసరావు మండిపడ్డారు. తెలుగుదేశం హయాంలో జరిగిన భూ దోపిడీని ఎందుకు ప్రశ్నించరని ఆయన నిలదీశారు.

చేయని తప్పులను కూడా తమ ప్రభుత్వానికి అంటగడుతున్నారని.. ఇలాంటి దుర్మార్గపు పనులను ఎవరూ సమర్థించవద్దని వెల్లంపల్లి విజ్ఞప్తి చేశారు.