వినాయక మంటపాల అనుమతిపై ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో వినాయక మండపాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వలేదన్న విషయాన్ని అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఏపీలోనూ అదే విధానాన్ని పాటించాలని అధికారులు సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో వేడుకలు, ఊరేగింపులపై నిషేధం విధించే ఉద్దేశ్యంలో ప్రభుత్వం వుంది. వ్యక్తిగతంగా ఇళ్లలోనే వినాయక చవితి పూజలు నిర్వహించుకునేలా సూచనలు జారీ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

మరోవైపు రాష్ట్రంలో వినాయక మండపాలకు అనుమతినివ్వాలని ప్రభుత్వాన్ని కోరారు నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ గణేశ్ మంపాలను ఏర్పాటు చేసుకుని వేడుకలు నిర్వహించుకునే వారికి ఎలాంటి ఆటంకాలు కలిగించొద్దని ఆయన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కోరారు.

రాష్ట్రంలోని అన్ని ప్రముఖ దేవాలయాలు తెరిచి వినాయక వేడుకలు జరుపుకునే మండపాల విషయంలో అనుమతులు ఇవ్వకపోవడం దారుణమన్నారు. వేడుకలకు అడ్డుపడకుండా రెవెన్యూ, పోలీస్, ఇతర అధికారులు ఆదేశించాలని రఘురామ సీఎంను కోరారు.

వేడుకలకు విఘ్నాలు కలిగించడం హిందువుల మనోభావాలను గాయపరచడమేనని ఆయన వ్యాఖ్యానించారు. స్వాతంత్య్ర ఉద్యమ కాలం నుంచి వినాయక చవితి వేడుకలను ప్రజలకు కుల, మతాలకు అతీతంగా సామూహికంగా నిర్వహించుకుంటున్నారని రఘురామ కృష్ణంరాజు గుర్తుచేశారు.

లోకమాన్య బాలగంగాధర తిలక్ సామూహికంగా వినాయక వేడుకలు జరుపుకునే పవిత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఎంపీ తెలిపారు