12 డిమాండ్లపై నేటి నుండి వర్క్ టూ రూల్: ఈ నెల 10 నుండి ఏపీ విద్యుత్ ఉద్యోగుల సమ్మె
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ ఉద్యోగులు ఎల్లుండి నుండి సమ్మెకు దిగనున్నారు. రేపటి వరకు తమ సమస్యలను పరిష్కరించకపోతే సమ్మెను కొనసాగిస్తామని జేఏసీ ప్రకటించారు.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యుత్ ఉద్యోగులు మంగళవారం నుండి వర్క్ టూ రూల్ ను పాటిస్తున్నారు. రేపటిలోపుగా తమ సమస్యలను పరిష్కరించాలని విద్యుత్ ఉద్యోగులు కోరుతున్నారు. లేకపోతే ఈ నెల 10వ తేదీ నుండి సమ్మెకు దిగుతామని విద్యుత్ ఉద్యోగుల సంఘం నేతలు ప్రకటించారు.
గత నెల 20వ తేదీన తమ డిమాండ్లపై ప్రభుత్వానికి విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నేతలు సమ్మె నోటీసు ఇచ్చారు. 12 డిమాండ్లను విద్యుత్ ఉద్యోగులు ప్రభుత్వం ముందుంచారు. వేతన ఒప్పందంతోపాటు పలు అంశాలను విద్యుత్ ఉద్యోగులు ప్రభుత్వం ముందుంచారు. ఈ నెల 7వ తేదీన విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు విద్యుత్ ఉద్యోగుల జేఏసీతో చర్చలు జరిపారు. అయితే చర్చలు విఫలమయ్యాయి. మరోసారి చర్చలకు పిలుస్తామని ప్రభుత్వం ప్రకటించింది . దీంతో ప్రభుత్వం నుండి చర్చల కోసం విద్యుత్ ఉద్యోగుల జేఏసీ వేచి చూస్తుంది.
ఇవాళ విద్యుత్ కార్యాలయం ముందు నిరసనకు పిలుపునిచ్చింది. అయితే ఈ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నట్టుగా నిన్న రాత్రి విద్యుత్ జేఏసీ నేత చంద్రశేఖర్ ప్రకటించారు. మహాధర్నాకు బదులుగా వర్క్ టూ రూల్ ను పాటిస్తామని ప్రకటించారు. అయితే విద్యుత్ ఉద్యోగుల నిరసనను దృష్టిలో ఉంచుకొని పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యుత్ శాఖ ప్రధాన కార్యాలయంతో పాటు రైల్వే స్టేషన్, బస్ట్ స్టేషన్ ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరిని తనిఖీ చేసి పంపుతున్నారు. ముందు జాగ్రత్తగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.1999లో ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో విద్యుత్ ఉద్యోగులు సమ్మె చేశారు. విద్యుత్ ఉద్యోగులు సమ్మె చేయకుండా ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకుంటుందోననే సర్వత్రా ఆసక్తి నెలకొంది.