369 కాదు 1166... కేంద్రం నుండి ఏపికి తప్పుడు సమాచారం: ఏపి డిజిపి సవాంగ్
రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలంతా సామాజిక దూరాన్ని పాటించాలని ఏపి డిజిపి గౌతమ్ సవాంగ్ పిలుపునిచ్చారు.
గుంటూరు: ఆంధ్ర ప్రదేశ్ లో ఇప్పటివరకు బయటపడ్డ కరోనా పాజిటివ్ కేసుల్లో డిల్లీ నుండి వచ్చినవే ఎక్కువగా వున్నాయని డిజిపి గౌతమ్ సవాంగ్ తెలిపారు. రాష్ట్రంలో విదేశాలు నుండి వచ్చిన వారికి, వారి కాంటాక్ట్ ని కలుపుకుంటే 22 మాత్రమే పాజిటివ్ కేసులు వచ్చాయని... మిగతావి మొత్తం డిల్లీ కేసులేనని వెల్లడించారు.
ఏపి నుండి ఢిల్లీకి వెళ్లినవారు 369 మందేనని కేంద్రం చెప్పిందని... అది తప్పని తమ విచారణలో తేలిందని అన్నారు. ఏపీ పోలీస్ పూర్తిస్థాయిలో విచారణ చేసి డిల్లీ నుండి ఏపికి మొత్తం 1166 మంది వచ్చారని తేల్చిందన్నారు. వీరిలో 1033 మందిని గుర్తించి క్వారంటైన్ చేశామని... మరో 133 మంది ఇతర ప్రాంతాల్లో ఉన్నారని డిజిపి తెలిపారు.
గుంటూరు జిల్లా యంత్రాంగం కరోనా నివారణకు విస్తృతంగా పని చేస్తోందని ప్రశంసించారు. గుంటూరు అర్బన్ లో 8 రెడ్ జోన్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం, పోలీస్ శాఖ కరోనా నివారణ కోసం విధించిన నిబంధనలను ప్రజలు ఖచ్చితంగా పాటించాలని... ముఖ్యంగా స్వీయ నియంత్రణ పాటించాలని గౌతమ్ సవాంగ్ సూచించారు.
ఏపీలో కరోనా ఫేజ్ త్రీ దశలో ఉందని జరుగుతున్న ప్రచారమంతా అవాస్తవమన్నారు. ఇప్పుడున్న పరిస్థితులలో ప్రజా రవాణాని ప్రారంభించడం మంచిది కాదని... అయితే ఒకవేళ లాక్ డౌన్ ఎత్తివేసినా ప్రజా రవాణా దశల వారీగా ప్రారంభించటం మంచిదని డిజిపి గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు.