రాష్ట్రం వ్యాప్తంగా ఉన్న 76వేల మంది పోలీసు సిబ్బందితో ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ పై ఆయన అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

ఇటీవల జరిగిన శిరోముండనం సంఘటనతో మొత్తం పోలీసులందరికీ ప్రవర్తన నియమావళిపై డీజీపీ దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు గౌరవిస్తూ నేరస్థులు భయపడాలి... పొలీస్ వ్యవస్ధలో ప్రక్షాళన కావాలన్నారు.

కోవిడ్ సమయంలో పోలీసుల సర్వీసులో చాలా మంచి పేరు తెచ్చుకున్నామని డీజీపీ ప్రశంసించారు. ఒక పోలీసు తప్పు చేస్తే పోలీస్ వ్యవస్ధ మొత్తాన్ని తప్పు పడతారని ఆయన గుర్తుచేశారు.

ఈ ప్రభుత్వానికి మార్పు, పరివర్తన ముఖ్య అజెండా అన్న సవాంగ్... సామాన్య ప్రజలకు పోలీసు సేవలు అందుబాటులో ఉండాలన్నారు. గత సంవత్సరంగా అదే ఆలోచనతో పని చేస్తున్నామని.. అనుకోకుండా జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో కొందరు సామాన్యులు ఇబ్బంది పడ్డారని గౌతమ్ సవాంగ్ అంగీకరించారు.

నేరం చేస్తే డిపార్ట్మెంట్, న్యాయ పరమైన చర్యలు కచ్ఛితంగా ఉంటాయని డీజీపీ పేర్కొన్నారు. పోలీసు సిబ్బంది మీద పోలీసులే చర్యలు తీసుకోవడం చాలా బాధాకరం.. కానీ తప్పదని ఆయన స్పష్టం చేశారు.

ఆత్మ‌ విమర్శ చేసుకోవడం చాలా అవసరమని... మార్పు కోసం చేయాల్సింది చాలా ఉందని, మన అందరం కలిసి చేద్దామని డీజీపీ సూచించారు. పోలీసు సిబ్బంది మొత్తం రాబోయే రెండు నెలలో ఓరియంటేషన్ క్లాసులకు అటెండవ్వాలని ఆయన కోరారు.

మార్పులు ప్రతీ పోలీసు స్టేషన్లో కనిపించాలన్న ఆయన .. పోలీసు స్టేషనుకు వచ్చిన వారిని మంచిగా  రిసీవ్ చేసుకొవాలని సూచించారు. ప్రభుత్వం మన ప్రవర్తనను గమనిస్తోందని... మనకు వారాంతపు సెలవులు ఇచ్చారని డీజీపీ చెప్పారు.

పోలీసు అనేది ఒక సేవ చేయడానికి వచ్చిన అవకాశంగా భావించాలని గౌతమ్ సూచించారు. టెక్నాలజీ స్కిల్స్ లో పది అవార్డులు వచ్చాయని... మొత్తం డిపార్ట్‌మెంట్‌కు 26 అవార్డులు వచ్చాయన్నారు. సమగ్రతా లోపం, లంచగొండితనం అనేవి ఉండకూడదని.. అవినీతిని రాష్ట్రంలో లేకుండా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని డీజీపీ చెప్పారు.