విజయనగరం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రరాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి సరికొత్త అవతారం ఎత్తారు. అతిచిన్న వయస్సులోనే డిప్యూటీ సీఎంగా ఛాన్స్ కొట్టేసిన పుష్పశ్రీవాణి తొలిసారిగా నటి అవతారం ఎత్తారు. 

ప్రకృతి వ్యవసాయం ప్రాధాన్యం ప్రతీ ఒక్కరికీ తెలియజేసేలా రూపొందిస్తున్న అమృతభూమి సినిమాలో టీచర్ పాత్రలో ఒదిగిపోయారు. రాజకీయాల్లో నిత్యం బిజీబిజీగా గడిపే ఆమె ఆదివారం ప్రజలకు ఉపయోగపడే ప్రకృతి వ్యవసాయంలో చిన్న పాత్ర పోషించారు. 

కురుపాం మండలంలోని లోవముఠా ప్రాంతం గొరడ గ్రామంలో జరిగిన సీరియల్ షూటింగ్ లో డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి పాల్గొన్నారు. గొరడ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాల ఆవరణలో ఉపాధ్యాయురాలిగా విద్యార్థులకు ప్రకృతి వ్యవసాయంపై వివరిస్తున్న సన్నివేశాన్ని చిత్రీకరించారు. 

ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేలా సినిమా నిర్మించడం ఆనందంగా ఉందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి.  ఈ సినిమాలో నటుడు రాజాప్రసాద్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే జిల్లా కలెక్టర్ డా.హరిజవహర్ లాల్ అధికారి పాత్రలో నటించారు. 

ఇకపోతే ఈ సినిమాను ఏపీ రైతు సాధికార సంస్థ, అజీం ప్రేమ్ జీ ఫౌండేషన్ సహకారంతో నిర్మిస్తున్నారు. ప్రముఖ రచయిత వంగపండు ప్రసాదరావు ఈ ప్రకృతి వ్యవసాయం సినిమాకి కథను అందించారు.