రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు రోజుకో విధంగా ఊహించని మలుపులు తిరుగుతున్నాయని ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అభిప్రాయపడ్డారు. రాష్ట్రానికి హోదా కోసం, ప్రజల హక్కుల కోసమే సీఎం చంద్రబాబు పోరాటం చేస్తున్నారని, ఆయనకు మనమంతా అండగా నిలవాలని కేఈ క్రిష్ణమూర్తి కోరారు.

మంగళవారం అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... రాష్ట్రాలకు ఇచ్చిన హామీలను కేంద్రం అమలు చేయడం లేదని, ఫెడరల్ స్పూర్తిని దెబ్బతీసేలా కేంద్రం వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. అలాగే రెవెన్యూ శాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామని, అన్ని రకాల భూములను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చేందుకు భూ సేవ కార్యక్రమాన్ని రూపొందించామన్నారు.

అలాగే ఆధార్ తరహాలో 11 అంకెల విశిష్ట సంఖ్యతో భూధార్ కేటాయిస్తామని, భూమికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఇందులో పొందుపరుస్తామన్నారు. రాష్ట్రంలోని 2.84 కోట్ల వ్యవసాయ భూములు, 50 లక్షల పట్టణ ఆస్తులున్నాయని, 8.5 లక్షల గ్రామీణ ఆస్తులకు భూ-ధార్ కేటాయిస్తున్నామని కేఈ అన్నారు.