Asianet News TeluguAsianet News Telugu

అమరావతిపై ద్వేషం లేదు, కమ్మలకు వ్యతిరేకం కాను: జగన్, బిల్లుల ఆమోదం

అమరావతిపై తనకు ద్వేషం లేదని, కమ్మవారిపై వ్యతిరేకత లేదని ఏపీ సీఎం వైఎస్ జగన్ ఏపీ అసెంబ్లీలో అన్నారు. పాలనా వికేంద్రీకరణ బిల్లుకు, సీఆర్డీఎ ఉపసంహరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది.

AP Decentralisation and Development Bill passed: YS Jagan on Amaravati
Author
Amaravathi, First Published Jan 20, 2020, 11:14 PM IST

అమరావతి: ఏపీ పాలనా వికేంద్రీకరణ బిల్లుకు శాసనసభ సోమవారం రాత్రి ఆమోదం తెలిపింది. సిఆర్డీఎ ఉపసంహరణ బిల్లుకు కూడా అసెంబ్లీ ఆమోదం తెలిపింది. శాసనసభలో ఆ బిల్లులపై జరిగిన చర్చకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సుదీర్ఘమైన సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత సభ ఆ బిల్లను ఆమోదించింది. బిల్లుల ఆమోదం తర్వాత ఇది చారిత్రాత్మకమైన రోజు అని స్పీకర్ తమ్మినేని సీతారాం ్న్నారు.  ఆ తర్వాత సభ రేపటికి వాయిదా పడింది.

అంతకు ముందు జగన్ మాట్లాడుతూ... తనకు అమరావతిపై కోపం లేదని, అమరావతి నుంచి రాజధానిని తరలిస్తానని తాను చెప్పలేదని స్పష్టం చేశారు. అమరావతి రైతులకు, ప్రజలకు తను భరోసా ఇస్తున్నానని చెప్పారు. అమరావతిపై తనకు కోపం ఉంటే శాసన రాజధానిగా ఎందుకు కొనసాగిస్తామని ఆయన ప్రశ్నించారు. 

Also Read: అసెంబ్లీ మెట్లపై మౌనదీక్ష, పాదయాత్ర: చంద్రబాబు సహా ఎమ్మెల్యేల అరెస్టు

అమరావతిని అభివృద్ధి చేసే స్తోమత రాష్ట్రానికి లేదని, విశాఖపట్నంపై తనకు ప్రత్యేకమైన ప్రేమ ఏదీ లేదని, విశాఖ ఇప్పటికే రాష్ట్రంలో నెంబర్ వన్ నగరమని ఆయన అన్నారు. కృష్ణా జిల్లాకు తన మేనత్తను ఇచ్చామని, కృష్ణా జిల్లా ప్రజలు తనను ఎంతో ఆదరిస్తారని ఆయన చెప్పారు. కమ్మవారికి తాను వ్యతిరేకమని ప్రచారం చేస్తున్నారని, అందులో నిజం లేదని ఆయన అన్నారు. 

రాయలసీమలో హైకోర్టును పెడుతామని బిజెపి తన ఎన్నికల ప్రణాళికలో చెప్పిందని, దాన్ని కూడా చంద్రబాబు వక్రీకరిస్తున్నారని ఆయన అన్నారు. మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు జరిగిన శ్రీబాగ్ ఒడంబడికలోని అంశాలను జగన్ తన ప్రసంగంలో ప్రస్తావించారు.  అభివృద్ధి ఒకే చోట కేంద్రీకృతం కావడం వల్ల ఏ విధమైన నష్టం జరుగుతుందో శ్రీకృష్ణ కమిటీ కూడా చెప్పిందని ఆయన గుర్తు చేశారు. 

Also Read: చంద్రబాబు వేల ఎకరాల భూములు కొన్నారు: జగన్

కృష్ణా జిల్లాతో తమకు కూడా అనుబంధం ఉందని, చంద్రబాబుకు పిల్లనిచ్చిన ఎన్టీఆర్ ది నిమ్మకూరు అని, తన మేనత్తది ఇదే కృష్ణా జిల్లా మైవరం అని, కృష్ణా జిల్లాతో తమ కుటుంబానికి నాలుగు దశాబ్దాల అనుబంధం ఉందని జగన్ చెప్పారు. గుంటూరు జిల్లా ప్రజలు తన పట్ల అపారమైన ప్రేమ చూపించారని ఆయన అన్నారు. 

కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 33 నియోజకవర్గాలుంటే 23 మంది ఎమ్మెల్యేలను వైసీపీ జెండాపై గెలిపించారని, అది గర్వంగా ఉందని ఆయన అన్నారు. అమరావతి కచ్చితంగా మహానగరంగా అభివృద్ధి చెందుతుందని, తనకు ఈ ప్రాంతంపై ద్వేషం ఉంటే అసెంబ్లీని ఇక్కడే ఎందుకు కొనసాగిస్తామని జగన్ అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios