చంద్రబాబు బినామీలతో కొనుగోలు చేయించిన భూమలు ఇప్పుడు పోతాయేమోనన్న భయం పట్టుకుందని సీఎం ఎద్దేవా చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టుల్లో నీళ్లు నింపుకోలేని పరిస్థితి రాయలసీమ జిల్లాల్లో ఉందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.

అమరావతిలోని వ్యవసాయ భూమిని రాజధానికి వాడటం ప్రమాదకరమన్నారు. రాజధానిపై దూరదృష్టితో శివరామకృష్ణన్ ఒక వ్యాసం రాశారని, కమిటీ రిపోర్టులను బాబు గడ్డిపరకలా తీసి పారేశారని జగన్ మండిపడ్డారు.

Also Read:అచ్చెన్నాయుడికి స్పీకర్ వార్నింగ్: తమ్మినేనికి చంద్రబాబు చురకలు

బాబు ఏకపక్షంగా చేయాలనుకుంది చేసుకుంటూ వెళ్లిపోయారని, చివరికి ఓటు నోటు కేసులో దొరికిపోయి ఇక్కడకు పారిపోయి వచ్చారని సీఎం ఆరోపించారు. వస్తూ వస్తూ నూజీవీడులో రాజధాని వస్తుందని చెప్పి.. నోటిఫికేషన్ కన్నా ముందు తన మనుషులతో భూములు కొనిపించారని జగన్ అన్నారు.

నిర్మాణాలకు అనువుగాలేని గ్రామాల్లో, రోడ్డు కూడా లేని గ్రామాల్లో భూములను కొనుగోలు చేశారని తెలిపారు. ఇందులో చంద్రబాబు సొంత కంపెనీ హెరిటేజ్ కూడా ఉందని జగన్ గుర్తుచేశారు.

Also Read:ఏపీ అసెంబ్లీలో గందరగోళం: టీడీపీ సభ్యుల సస్పెన్షన్, మార్షల్స్‌తో గెంటివేత

అమరావతి అనేది విజయవాడలో లేదు, గుంటూరులోనూ లేదన్నారు. విజయవాడ, గుంటూరు మధ్య భ్రమరావతి చూపించారని.. చివరికి రోడ్లు, డ్రైనేజీలు వంటి కనీస సదుపాయాలు లేవన్నారు. కానీ అమరావతి భూములకు లక్ష కోట్ల రూపాయలు వెల కట్టారని జగన్ దుయ్యబట్టారు.

ఇప్పుడు మళ్లీ ఖర్చు లేకుండా రాజధాని నిర్మాణం జరిగిపోతుందని ప్రతిపక్షనేత అంటున్నారని సీఎం చెప్పారు. ఖర్చు ఉండదని చెప్పి ఐదేళ్లలో ఐదు వేల కోట్లు ఖర్చు చేశారని, ఇందులో బకాయిలుగా రూ.2,297 కోట్లు ఎగ్గొట్టారని జగన్ ప్రస్తావించారు.