అమరావతి: ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ ప్రధాన ద్వారం వద్ద మెట్లపై మౌనదీక్షకు దిగారు. ఆ తర్వాత పాదయాత్ర చేసేందుకు సిద్దపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యేలు సభ నుంచి సస్పెన్షన్ కు గురైన తర్వాత ఆయన మెట్లపై బైఠాయించారు. ఆ తర్వాత పాదయాత్రగా అసెంబ్లీ నుంచి మందడం వెళ్లేందుకు సిద్ధపడ్డారు. 

చంద్రబాబు పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. చంద్రబాబును అరెస్టును చేశారు. చంద్రబాబుతో పాటు టీడీపీ ఎమ్మెల్యేలను కూడా పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేందుకు ప్రభుత్వం సిద్ధపడిందని చంద్రబాబు విమర్శించారు. జగన్ తీరు పిచ్చి తుగ్లక్ ను తలపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. సభలో టీడీపీ సభ్యులు మాట్లాడితే మధ్యలోనే మేక్ కట్ చేస్తున్నారని ఆయన అన్నారు. అమరావతిని తరలిస్తే ఉపాధి ఉండదని ఆయన అన్నారు. రాష్ట్రంలో కర్ఫ్యూ విధించి యుద్ధవాతావరణం సృష్టించారని ఆయన విమర్శించారు. 

also Read: చంద్రబాబు వేల ఎకరాల భూములు కొన్నారు: జగన్

అంతకు ముందు ఏపీ శాసనసభ నుంచి సస్పెన్షన్ కు గురైన తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కాన్వాయ్ వెళ్లే దారిలో బైఠాయించారు. టీడీపీ ఎమ్మెల్యేలను మార్షల్స్ అసెంబ్లీ నుంచి పంపించివేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రసంగానికి అడ్డు తగలడంతో స్పీకర్ టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. 

Also Read: ఏపీ అసెంబ్లీలో గందరగోళం: టీడీపీ సభ్యుల సస్పెన్షన్, మార్షల్స్‌తో గెంటివేత

మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ కు తీర్మానం ప్రతిపాదించారు. ఆ తీర్మానాన్ని సభ ఆమోదించడంతో స్పీకర్ వారిని సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ తర్వాత వారిని మార్షల్స్ సాయంతో వెలుపలికి పంపించేశారు. ఈ సమయంలో మార్షల్స్ తో టీడీపీ సభ్యులు వాదనలకు దిగారు.