పంచాయతీ ఎన్నికలపై ఎస్‌ఈసీ నిమ్మగడ్డకు సీఎస్ ఆదిత్యనాథ్‌ దాస్‌ లేఖ రాశారు. ప్రస్తుత పరిస్ధితుల్లో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని తేల్చిచెప్పారు సీఎస్‌. ఎన్నికల నిర్వహణపై మరోసారి పునః పరిశీలించాలని సీఎస్ విజ్ఞప్తి చేశారు.

సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకూ ఎన్నికలపై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని కోరారు సీఎస్‌. అదే సమయంలో ఎస్‌ఈసీ కోరినట్లుగా అధికారులను తొలగించడం సాధ్యం కాదని సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ స్పష్టం చేశారు.

ఎస్ఈసీ తొలగించిన అధికారులు కరోనా విధుల్లో ఉన్నారని చీఫ్ సెక్రటరీ వెల్లడించారు. ఎస్‌ఈసీ, ప్రభుత్వం ఉమ్మడిగా ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు చెప్పిందన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

Also Read:నిమ్మగడ్డదే పైచేయి.. ఎస్ఈసీ కార్యాలయానికి ద్వివేది, గిరిజా శంకర్

కరోనా మొదటి డోస్‌ తీసుకున్న వారికి రెండో డోస్‌ ఇచ్చిన నాలుగు వారాలకు ఇమ్యూనిటీ వస్తుందని ఆదిత్యనాథ్ దాస్ తెలిపారు. పోలింగ్‌, వ్యాక్సినేషన్‌ రెండూ ఏకకాలంలో నిర్వహించడం సాధ్యం కాదని సీఎస్ స్పష్టం చేశారు.

పోలింగ్‌, వ్యాక్సినేషన్‌ రెండూ ఒకేసారి జరగాలంటే వ్యాక్సినేషన్ వాయిదా వేయాల్సి వస్తుందని ఆదిత్యనాథ్ దాస్ వెల్లడించారు. హైకోర్టు ఉత్తర్వులను మనస్ఫూర్తిగా పాటించేందుకు ఎస్‌ఈసీ, ప్రభుత్వం ప్రయత్నించాలని సీఎస్ విజ్ఞప్తి చేశారు.

ఎస్‌ఈసీకి చెప్పిన విషయాలన్నీ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పీలో ఉన్నాయని సీఎస్‌ వెల్లడించారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకూ ఆగాలని... అలాగే నోటిఫికేషన్ ఇవ్వొద్దని ఎస్‌ఈసీని కోరారు సీఎస్.