వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ పై వైఎస్ షర్మిల ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఎప్పటికైనా వాళ్లు తనవద్దకు రావాల్సిందే అనేలా షర్మిల వ్యాఖ్యలు చేశారు. 

YS Sharmila : ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన సోదరుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఎప్పటికైనా జగన్ తిరిగి కాంగ్రెస్ గూటికి రావాల్సిందే అనేలా ఆమె వ్యాఖ్యలున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఒక మహాసముద్రం అయితే వైఎస్సార్ కాంగ్రెస్ లాంటి పార్టీలు పిల్లకాలువలని ఆమె అన్నారు. ఎప్పటికైనా ఈ పిల్లకాలువలన్నీ సముద్రంలో కలిసి తీరాల్సిందేనని షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇక బిజెపి, టిడిపి, జనసేన పార్టీలే కాదు వైసిపి కూడా పరోక్షంగా కూటమిలో ఉందని షర్మిల అన్నారు. అందుకే వైసిపి ఏం చేసినా ప్రభుత్వం నుండి ఎటువంటి ఆంక్షలు ఉండవు... కానీ కాంగ్రెస్ ఏం చేయాలన్నా కూటమి ప్రభుత్వం ఆంక్షలు విధిస్తుందన్నారు. వైసిపి నాయకులు కార్ల కింద జనాలను వేసి తొక్కుకుంటూ వెళుతున్నా వారికి అన్ని అనుమతులు ఇస్తారు... తమను మాత్రం శాంతియుత పోరాటాలు చేస్తున్నా హౌజ్ అరెస్ట్ లు చేస్తారంటూ ప్రభుత్వ తీరుపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.

వినే వాళ్ళు ఉంటే ఏదైనా చెప్తారన్నట్లు వైసిపి నాయకులు కూడా ఇలాగే సింగయ్య హత్య గురించి ఏదేదో చెబుతున్నారన్నారు. గతంలో వైఎస్ వివేక హత్య విషయంలో మాట మార్చినట్లే ఇప్పుడు సింగయ్య మరణం విషయంలోనూ మారుస్తున్నారని... ఆ యాక్సిడెంట్ వీడియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) గ్రాఫిక్ అంటున్నారని షర్మిల పేర్కొన్నారు. అయినా మాట మార్చడం వైసిపికి అలవాటే అంటూ షర్మిల ఎద్దేవా చేశారు.

బనకచర్లపై కాంగ్రెస్ స్టాండ్ ఇదే : షర్మిల

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ మధ్య ప్రస్తుతం అగ్గి రాజేసిన బనకచర్ల ప్రాజెక్ట్ పై షర్మిల స్పందించారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉంటుందన్నారు. బనకచర్ల ప్రాజెక్టుతో తమకు నష్టం జరుగుతుందంటూ తెలంగాణ ప్రభుత్వం, అక్కడి రాజకీయ పార్టీలు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నాయని షర్మిల అన్నారు. ఈ క్రమంలో ఏపీకి దక్కాల్సిన నీటి హక్కుల కోసం అన్ని పార్టీలను కలుపుకుపోతూ పోరాడేందుకు కాంగ్రెస్ సిద్దంగా ఉందన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఇటు రాష్ట్రంలో, అటు దేశంలో అధికారంలోకి వస్తేనే విభజన హామీలు నెరవేరతాయని షర్మిల అన్నారు. అందుకే రాహుల్ గాంధీని ప్రధానిని అవ్వాలని కోరుకుంటున్నానని... అప్పుడే ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా వస్తుందన్నారు. ఏపీ అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని... తమ నిర్ణయాలు, చర్యలన్నీ ఆ దిశగానే ఉంటాయని షర్మిల స్పష్టం చేశారు.

కూటమి ప్రభుత్వంలో ఏపీకి అన్యాయమే...

ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవ్వాల్సిన అవసరం ఉందన్నారు షర్మిల. గత 11 ఏళ్లుగా మోడీ ప్రధాని గా ఉండి విభజన హామీలను నెరవేర్చలేదని... కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మొదటి ప్రాధాన్యత ఈ హామీలను నెరవేర్చడమేనని షర్మిల స్పష్టం చేశారు.

ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేశారు.. ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గించి అన్యాయం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పోలవరాన్ని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కింద మార్చారు...నీటి నిల్వ కోసం కట్టిన బ్యారేజ్ గా మార్చారన్నారు. దీని ఎత్తు 45 నుంచి 41 కు తగ్గిస్తుంటే అడిగే ఒక్క మగాడు లేడు... పార్లమెంట్ లో ఒక్కరు కూడా నోరు విప్పలేదన్నారు. టీడీపీ,జనసేన ఎంపీలకే కాదు వైసిపి ఎంపీల్లోనూ ఒక్కరికీ దమ్ము లేదంటూ షర్మిల మండిపడ్డారు.

టిడిపి, జనసేనతో పాటు వైసిపి పార్టీ కూడా మోడీకి తొత్తుగా మారి పని చేస్తోంది... రాష్ట్రాన్ని గాలికి వదిలేసారని అన్నారు. మోడీ నాయకత్వంలో రాష్ట్రం బాగుపడే పరిస్థితులు లేవు... విభజన సమస్యలు అమలు కావన్నారు. రాజధాని నిర్మాణ బాధ్యత కేంద్రానిది…విభజన చట్టంలోనే ఇందుకు కేంద్రం నిధులు ఇవ్వాలని ఉందన్నారు. కానీ కేంద్రం అమరావతి నిర్మాణానికి నిధులకు బదులు అప్పులు ఇస్తున్నారని... ఇలా రాష్ట్రం నెత్తిన మరింత భారం మోపుతున్నారని షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు.