Asianet News TeluguAsianet News Telugu

జగన్ భద్రతపై సీఎంవో సీరియస్ : హెలికాప్టర్ ల్యాండింగ్ పై నిర్లక్ష్యం, నోటీసులు జారీ


సీఎం జగన్ పర్యటనకు సంబంధించి తప్పుడు సమాచారం ఇవ్వడంపై వేణుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం భద్రతకు సంబంధించి తప్పుడు సమాచారం ఇచ్చారంటూ మండిపడ్డారు. 
 

ap cmo officials serious on ys jagan helicopter landing issue
Author
Amaravathi, First Published Sep 23, 2019, 12:26 PM IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత భద్రతకు సంబంధించి సీఎంవో కార్యాలయం ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎం జగన్ హెలికాప్టర్ ల్యాండింగ్ విషయంలో అధికారులు అలసత్వంగా వ్యవహరించారంటూ చర్యలకు రంగం సిద్ధం చేసింది.  

రెండు రోజులుగా సీఎం జగన్ హెలికాప్టర్ ల్యాండింగ్ కు సంబంధించి అధికారులు తప్పుడు సమాచారం ఇస్తున్నారంటూ సీఎంవో అధికారులు మండిపడ్డారు. సోమవారం ఉదయం తాడేపల్లిలోని తన నివాసం నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు గన్నవరం విమానాశ్రయం బయలు దేరారు. 

అయితే గన్నవరం విమానాశ్రయంలో ల్యాండింగ్ కు సంబంధించి వివాదం ఉందని సీఎంవో అధికారులకు సమాచారం ఇచ్చారు. దాంతో ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇకపోతే శనివారం కర్నూలు జిల్లాలో సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో కూడా జగన్ హెలికాప్టర్ కు సంబంధించి తప్పుడు సమాచారం ఇచ్చారని సీఎంవో కార్యాలయం ఆరోపించింది. హెలికాప్టర్ ల్యాండింగ్ కు సంబంధించి వివరాలను డిగ్రీలు, మినిట్స్,సెకన్స్ లో ఫార్మెట్ లో అందజేయాల్సి ఉండగా డిగ్రీలో మాత్రమే ఇచ్చారని సీఎంవో అధికారులు ఆరోపిస్తున్నారు. ఇది చాలా నిర్లక్ష్యం అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. 

ఈ పరిణామాల నేపథ్యంలో హెలికాప్టర్ ల్యాండింగ్ వివాదానికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక సమర్పించాలని సీఎంవో కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ ను ఆదేశించింది. దాంతో జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశంని విచారణ అధికారిగా నియమించారు. 

కర్నూలు సర్వేశాఖ డీఈ వేణుకు కలెక్టర్  వీరపాండ్యన్ నోటీసులు అందజేశారు. సీఎం జగన్ పర్యటనకు సంబంధించి తప్పుడు సమాచారం ఇవ్వడంపై వేణుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం భద్రతకు సంబంధించి తప్పుడు సమాచారం ఇచ్చారంటూ మండిపడ్డారు. 

ఈ పరిణామాల నేపథ్యంలో నోటీసులు అందజేశారు. డీఈ వేణుపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే తనకు ఎలాంటి నోటీసులు అందలేదని డీఈ వేణు స్పష్టం చేశారు.  
 

Follow Us:
Download App:
  • android
  • ios