అమరావతి: ప్రజావేదిక నిర్మాణంపై అసెంబ్లీలో నిప్పులు చెరిగారు ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి. నిబంధనలకు తిలోదకాలిస్తూ ప్రజావేదిక నిర్మించిందని విమర్శించారు. అక్రమాలు కట్టడాలు తొలగిస్తే అసెంబ్లీలో చర్చించడం బాధాకరమన్నారు.

 చంద్రబాబు నివాసం చాలా ప్రమాదకర పరిస్థితిలో ఉందని చెప్పుకొచ్చారు. అక్రమ కట్టడాల వల్లే వరదలు వస్తున్నాయని తెలిపారు. తాను సీఎం చట్టాలు తనకు వర్తించవు, తనను ఏం ఎవరు ఏం చేస్తారంటూ చంద్రబాబు నాయుడు వ్యవహరించారని ఆరోపించారు. 

విజయవాడలో ఫ్లడ్ లెవెల్ 22.60 లెవెల్ ఉంటే, చంద్రబాబు నాయుడు నివాసం 19.50 ఎత్తులో ఉందని దాని వల్ల ముప్పు వాటిల్లే అవకాశం ఉంటుందని తెలిపారు. ఇలా నిర్మించడం వల్ల వరదలు వస్తాయని, ఇలాగే కట్టడాలు పెరిగిపోతే విజయవాడ మునిగిపోయే ప్రమాదం ఉందని అందువల్లే వాటిని తొలగించాలని తాను నిర్ణయించుకున్నట్లు తెలిపారు. 

రూల్స్ ఎవరికైనా ఒక్కటేనని స్పష్టం చేశారు. సామాన్యుడికి, సీఎంకి ఒకటే రూల్ అని స్పస్టం చేశారు. నిబంధనలను పట్టించుకోకుండా నాటి సీఎం వ్యవహరించడం సిగ్గుచేటు అని చెప్పుకొచ్చారు. 

రివర్ కంజర్వేట్ అథారిటీ, విజయవాడ ఇంజనీరింగ్ అధికారులు సైతం చంద్రబాబు నివాసం గానీ ప్రజావేదిక నిర్మాణం సరికాదంటూ స్పష్టం చేసిందని తెలిపారు. అలాగే లోకాయుక్త సైతం అభ్యంతరం వ్యక్తం చేసిందని తెలిపారు. అయినప్పటికీ నిబంధనలకు తిలోదకాలిస్తూ చంద్రబాబు నాయుడు ప్రజావేదిక, ఇల్లు నిర్మించారంటూ నిప్పులు చెరిగారు సీఎం జగన్.