కృష్ణా నదీ నీళ్లపై కేంద్ర మంత్రులకు జగన్ లేఖలు: కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు

కృష్ణా నదీ జలాల వాడకంపై తలెత్తిన వివాదాలపై ఏపీ సీఎం వైఎస్ జగన్ కేంద్ర మంత్రులకు లేఖలు రాశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రభుత్వంపై జగన్ ఆ లేఖల్లో తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.

AP CM YS Jagan writes letters to union ministers on Krishna river water disputes

అమరావతి: కృష్ణా నదిపై నిర్మిస్తున్న ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వంతో తలెత్తిన వివాదాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేంద్ర మంత్రులకు లేఖలు రాశారు. ఈ లేఖల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేశారు. జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్ కే కాకుండా పర్యావరణ, అటవీ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ కు కూడా ఆయన లేఖ రాశారు. 

తమ ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు ఇవ్వాలని ఆయన ప్రకాశ్ జవదేకర్ ను కోరారు. కేంద్ర మంత్రులకు రాసిన లేఖల్లో తెలంగాణ ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా నీటిని తోడేస్తోందని ఆయన ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా విద్యుదుత్పత్తి చేస్తోందని ఆయన ఫిర్యాదుచేశారు. 

తెలంగాణలోని అక్రమ ప్రాజెక్టులను సందర్శించిన తర్వాతనే కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) ప్రతినిధులు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించేలా ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరారు. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులపై తాము ఎన్ని ఫిర్యాదులు చేసినా కేఆర్ఎంబీ పట్టించుకోలేదని ఆయన విమర్శించారు.  వీలైనంత త్వరగా కేఆర్ఎంబీ పరిధిని నిర్ణయించాలని కూడా ఆయన కోరారు. సాగు, తాగు నీటి వాడకాన్ని, విద్యుత్తు ఉత్పత్రిని కృష్ణా బోర్డు పరిధిలోకి తేవాలని ఆయన కోరారు. 

కృష్ణా నదీ జలాల వాడకం విషయంలో తెలంగాణ ప్రభుత్వం మూర్ఖంగా వ్యవహరిస్తోందని, ఏపీ ప్రయోజనాలకు భంగం వాటిల్లే విధంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. కృష్ణా నదిపై గల ప్రాజెక్టుల వద్ద కేంద్ర బలగాల రక్షణ కల్పించాలని ఆయన కోరారు. తాను ఇదివరకు లేఖలు రాసిన విషయాన్ని తాజా లేఖలో గజేంద్ర సింగ్ షెకావత్ కు జగన్ గుర్తు చేశారు. 

కృష్ణా జలాల విషయంలో తెలంగాణ ప్రభుత్వ వైఖరి వల్ల తమ రాష్ట్రం వాటా కోల్పోతోందని జగన్ అన్నారు. కేఆర్ఎంబీ అనుమతి లేకుండా నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద తెలంగాణ విద్యుదుత్పత్తి చేస్తోందని ఆయన చెప్ాపరు. తెలంగాణ రాష్ట్ర వైఖరి వల్ల కృష్ణా జలాలు సముద్రంలో కలుస్తున్నాయని ఆయన అన్నారు.

శ్రీశైలంలో జలాశయంలో నీటి మట్టం 834 అడుగుల కన్న తక్కువ ఉన్నప్పటికీ తెలంగామ విద్యుదుత్పత్తి చేస్తోందని ఆయన ఫిర్యాదు చేశారు. జూన్ 1వ తేదీ నుంచి తెలంగాణ విద్యుత్తు ఉత్పత్తికి 19 టీఎంసీల నీరు వాడిందని, తెలంగాణ ఇలాగే వ్యవహరిస్తే శ్రీశైలం జలాశయం నిండదని ఆయన అన్నారు. 

శ్రీశైలం రిజర్వాయరులో 854 అడుగుల నీటి మట్టం ఉంటే తప్ప పోతిరెడ్డిపాడుకు గ్రావిటీ ద్వారా నీరు తీసుకుని వెళ్లలేమని చెప్పారు.  పోతిరెడ్డిపాడుపై ఆధారపడిన ప్రాజెక్టులకు నీళ్లు రావని ఆయన అన్నారు. దానివల్ల రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు మంచినీటి ఇబ్బందులు ఎదురవుతాయని ఆయన అన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios