జగనన్న వసతి దీవెన నిధులను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేయనున్నారు. అనంతపురం జిల్లా నార్పలలో జరిగే కార్యక్రమంలో పాల్గొననున్న జగన్.. వసతి దీవెన నగదును విద్యార్ధుల ఖాతాలో జమ చేస్తారు. 

విద్యార్ధులు, వారి తల్లులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. బుధవారం జగనన్న వసతి దీవెన నిధులను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేయనున్నారు. రాష్ట్రంలోని 9,55,662 మంది విద్యార్ధుల తల్లుల ఖాతాల్లోకి రూ.912.71 కోట్లను ఆయన విడుదల చేయనున్నారు. అనంతపురం జిల్లా నార్పలలో జరిగే కార్యక్రమంలో పాల్గొననున్న జగన్.. వసతి దీవెన నగదును జమ చేస్తారు. 

ఉన్నత చదువులు చదివే పేద విద్యార్ధులు భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బందిపడకుండా ఏటా రెండు విడతల్లో జగనన్న వసతి దీవెనను జగన్ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఐటీఐ విద్యార్ధులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్ధులకు రూ.15 వేలు.. డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఆర్ధిక సాయం చేస్తోంది జగన్ ప్రభుత్వం. ఇప్పటి వరకు 25,17,245 మంది విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో రూ.4.275.76 కోట్లను జమ చేసింది జగన్ సర్కార్. 

Also Read: జగన్ విదేశీ పర్యటన రద్దు, వసతి దీవెన వాయిదా.. ఎందుకిలా : క్లారిటీ ఇచ్చిన సీఎస్ జవహర్ రెడ్డి

కాగా.. షెడ్యూల్ ప్రకారం గత సోమవారమే అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలోని నార్పల మండల కేంద్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించాల్సి ఉంది. అక్కడ నిర్వహించే జగనన్న వసతి దీవెన కార్యక్రమానికి సంబంధించిన సభలో పాల్గొని లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయాల్సి ఉంది. సీఎం జగన్ పర్యటన సందర్భంగా చేసిన ఏర్పాట్లను కలెక్టర్ గౌతమి, ఎస్పీ శ్రీనివాసరావు, ఇతర అధికారులు శనివారం పరిశీలించారు. సీఎం జగన్ ప్రోగామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం కూడా సీఎం సభ కోసం సిద్దమవుతున్న వేదికను, ఏర్పాట్లను పరిశీలించారు. అయితే సీఎం జగన్ పర్యటన వాయిదా పడినట్టుగా అధికారులు ప్రకటించారు. దీంతో విపక్షాలు ప్రభుత్వంపై , సీఎం జగన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాయి. 

అయితే వసతి దీవెన నిధులు విడుదలకు సరిపడా నిధులు లేవని అందువల్ల వాయిదా వేయాల్సిందిగా ఆర్థిక శాఖ అధికారులు సూచించారని సీఎస్ జవహర్ రెడ్డి పేర్కొన్నారు. పాలనాపరమైన కారణాల వల్లే వసతి దీవెన వాయిదా పడిందని జవహర్ రెడ్డి స్పష్టం చేశారు. ఏడాదిన్నరగా కేంద్రంతో జరుగుతున్న చర్చలు ఓ కొలిక్కి వస్తున్నాయని ఆయన వెల్లడించారు.