ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విదేశీ పర్యటన రద్దుతో పాటు జగనన్న వసతి దీవెన కార్యక్రమం వాయిదాపడటంతో జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టారు ఏపీ సీఎస్ కేఎస్ జవహర్ రెడ్డి. అనేకసార్లు సీఎం ఇచ్చిన వినతుల్లో కొన్ని అంశాలపై ఈ వారంలో క్లారిటీ రానుందని ఆయన పేర్కొన్నారు. 

సీఎం విదేశీ పర్యటన రద్దుపై రకరకాలుగా ప్రచారం చేస్తున్నారని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. గత నెల 17న కూడా పీఎం ను కలిసి సీఎం జగన్ వినతిపత్రం ఇచ్చారని సీఎస్ తెలిపారు. అనేకసార్లు సీఎం ఇచ్చిన వినతుల్లో కొన్ని అంశాలపై ఈ వారంలో క్లారిటీ రానుందని ఆయన పేర్కొన్నారు. సీఎం కూడా ఢిల్లీ రావాల్సి ఉంటుందని జవహర్ రెడ్డి పేర్కొన్నారు. 

అందుకే వ్యక్తిగత పర్యటనలు రద్దు చేసుకోవాలని సీఎంను కోరామని సీఎస్ స్పష్టం చేశారు. వసతి దీవెన నిధులు విడుదలకు సరిపడా నిధులు లేవని అందువల్ల వాయిదా వేయాల్సిందిగా ఆర్థిక శాఖ అధికారులు సూచించారని సీఎస్ పేర్కొన్నారు. పాలనాపరమైన కారణాల వల్లే వసతి దీవెన వాయిదా పడిందని జవహర్ రెడ్డి స్పష్టం చేశారు. ఏడాదిన్నరగా కేంద్రంతో జరుగుతున్న చర్చలు ఓ కొలిక్కి వస్తున్నాయని ఆయన వెల్లడించారు. రెవెన్యూ లోటు నిధుల విడుదలపై త్వరలో స్పష్టత రానుందని సీఎస్ చెప్పారు. రాష్ట్రానికి మంచి జరుగుతుందని ఆశిస్తున్నామని.. రేపు ఢిల్లీ వెళ్తున్నామని, అవసరాన్ని బట్టి సీఎం కూడా వస్తారని జవహర్ రెడ్డి వెల్లడించారు.

Also Read: సీఎం జగన్ రేపటి అనంతపురం పర్యటన వాయిదా..

కాగా.. షెడ్యూల్ ప్రకారం సోమవారం అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలోని నార్పల మండల కేంద్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించాల్సి ఉంది. అక్కడ నిర్వహించే జగనన్న వసతి దీవెన కార్యక్రమానికి సంబంధించిన సభలో పాల్గొని లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయాల్సి ఉంది. సీఎం జగన్ పర్యటన సందర్భంగా చేసిన ఏర్పాట్లను కలెక్టర్ గౌతమి, ఎస్పీ శ్రీనివాసరావు, ఇతర అధికారులు శనివారం పరిశీలించారు. సీఎం జగన్ ప్రోగామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం కూడా సీఎం సభ కోసం సిద్దమవుతున్న వేదికను, ఏర్పాట్లను పరిశీలించారు. అయితే సీఎం జగన్ పర్యటన వాయిదా పడినట్టుగా అధికారులు ప్రకటించారు. దీంతో విపక్షాలు ప్రభుత్వంపై , సీఎం జగన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాయి.