వైఎస్సార్‌సీపీ 11వ వార్షికోత్సవం సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భావోద్వేగ‌ ట్వీట్‌ చేశారు. ‘‘ మహానేత ఆశయ సాధనే లక్ష్యంగా, విలువలు విశ్వసనీయతల పునాదులపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పురుడు పోసుకుంది. ఈ పదేళ్ల ప్రయాణంలో కష్ట సుఖాల్లో నాకు అండగా నిలిచిన ప్రజలకు, నాతో కలిసి నడిచిన నాయకులకు, నా వెన్నంటి ఉన్న కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’’ అంటూ జగన్ ట్వీట్ చేశారు. 

మరోవైపు తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. పార్టీ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌ విగ్రహానికి పార్టీ నేతలు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్‌, ఎమ్మెల్యే జోగి రమేష్, ఎంపీ సురేష్‌ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, దేశ చరిత్రలోనే వైఎస్సార్‌సీపీ ప్రస్థానం చాలా ప్రత్యేకమన్నారు. పార్టీని సరికొత్త రాజకీయ విధానాలతో నడిపిన చరిత్ర వైఎస్ జగన్‌దని ప్రశంసించారు. రాజశేఖర్ రెడ్డి మరణించినప్పుడు ప్రత్యేక పరిస్ధితుల్లో ఒంటరిగా పార్టీ పెట్టారని.. ఆ రోజు నుంచి నిరంతరం వైఎస్ జగన్‌.. ప్రజల్లో మమేకమయ్యారని రామకృష్ణారెడ్డి చెప్పారు.