అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి తన ఉదారత స్వభావాన్ని బయటపెట్టారు. తన కాన్వాయ్ వల్ల ఎవరికి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో జగన్ ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. 

తాడేపల్లిలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు కాన్వాయ్ వెళ్లేందుకు మరో మార్గాన్ని చూడాల్సిందిగా అధికారులకు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇకపోతే సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి శనివారం తాడేపల్లిలోని తన నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి కాన్వాయ్ తో బయలు దేరారు.  

బెంజ్‌ సర్కిల్‌ వచ్చేసరికి ఓ ప్రైవేట్ అంబులెన్స్ కుయ్ కుయ్ అంటూ అటుగా రావడంతో గమనించిన సీఎం జగన్ అంబులెన్స్ కు దారి ఇవ్వాలని ఆదేశించారు. అంబులెన్స్ కు రూట్ క్లియర్ చేసిన తర్వాత సీఎం కాన్వాయ్ ముందుకు కదిలింది.  

ప్రజలకు, ముఖ్యంగా అంబులెన్స్‌కు ఏమాత్రం అసౌకర్యం కలుగకుండా సీఎం కాన్వాయ్‌ వ్యవహరించడం, అంబులెన్స్‌కు దారి ఇచ్చిన తర్వాతే సీఎం వైఎస్‌ జగన్‌ ముందుకుసాగడం.. ప్రజలకు ఇబ్బంది కలుగకూడదన్న ఆయన సున్నితమైన హృదయానికి, ప్రజానిబద్ధతకు నిదర్శమని స్థానికులు చెప్తున్నారు. 

ఇకపోతే గతంలో కూడా ఇలాంటి ఘటనలే చోటు చేసుకున్నాయి. వైయస్ జగన్ ప్రజా సంకల్పయాత్రలో భాగంగా విజయనగరం జిల్లాలో పాదయాత్ర చేస్తుండగా నెల్లిమర్ల నియోజకవర్గంలో ప్రచార రథంపై మాట్లాడుతున్నారు. 

ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తుండగా కుయ్ కుయ్ మంటూ అంబులెన్స్ వచ్చింది. అంబులెన్స్ కు దారి ఇవ్వాలంటూ వైయస్ జగన్ స్వయంగా ప్రజలను కోరారు. ప్రజలంతా అంబులెన్స్ కు దారి ఇవ్వడం జరిగింది. 

మరోవైపు శ్రీకాకుళం జిల్లాలో ఎన్నికల ప్రచారంలో భాగంగా వైయస్ విజయమ్మ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. ఆసమయంలో కూడా అంబులెన్స్ రావడంతో దానికి దారి ఇవ్వాలంటూ ప్రజలను కోరారు. అంబులెన్స్ వెళ్లిన తర్వాత ప్రసంగం చేశారు.