అమరావతి: కేబినెట్ సమావేశం అనంతరం మంత్రులతో సీఎం జగన్ ప్రత్యేకంగా భేటీ అయ్యి ఎంపీటీసీ, జడ్పిటిసి, మున్సిపల్ ఎన్నికలపై చర్చించారు. ఈ సందర్భంగా కార్పొరేషన్ ఎన్నికలపై మంత్రులకు జగన్ దిశానిర్దేశం చేశారు. అన్ని ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం జగన్ స్పష్టం చేశారు. ముందు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ఎస్ఈసీని కోరదామని సీఎం మంత్రులతో అన్నట్లు తెలుస్తోంది. 

ఇటీవల ముగిసిన పంచాయతీ ఎన్నికల్లో అద్భుత ఫలితాలు రాబట్టామని... చరిత్రలో లేని విధంగా 80 శాతం ఫలితాలు సాధించడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శమని సీఎం జగన్ అన్నారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం కోటను బద్దలు కొట్టారంటూ చిత్తూరు జిల్లాకు  చెందిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని జగన్ ప్రశంసించారు.

ఇక అంతకు ముందు జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నవరత్నాలు అమలు క్యాలెండర్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈబీసీ నేస్తం, టిడ్కో ఇళ్ల నిర్మాణానికి 300 చదరపు అడుగుల భూమి కేటాయింపు, కాకినాడ ఎస్ఈజెడ్ భూములపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.

ఆరు గ్రామాలకు చెందిన 2,180 ఎకరాలను వెనక్కి ఇచ్చేయాలని కమిటీ నివేదిక ఇచ్చింది. దీనికి కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే త్వరలో జరగనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపైనా మంత్రి మండలి చర్చించింది. 

రాజధాని పరిధిలో అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలు పూర్తి చేసేందుకు ఏఎంఆర్డీఏకు రూ.3వేల కోట్ల బ్యాంకు గ్యారెంటీ ఇచ్చేందుకు కేబినెట్‌ అంగీకారం తెలిపింది. వైఎస్సార్‌ స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణం కోసం భాగస్వామ్య సంస్థ ఎంపికకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

కడప జిల్లాలో రెండు పారిశ్రామిక పార్కులకు భూ కేటాయింపులపై చర్చ జరిగింది. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని కేబినెట్ నిర్ణయించింది.