వెయ్యి రోజులుగా అమరావతిలో కృత్రిమ ఉద్యమాలు: ఏపీ అసెంబ్లీలో జగన్
అమరావతిలో వెయ్యి రోజులుగా కృత్రిమ ఉద్యమాలు సాగుతున్నాయని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు. ఇతర ప్రాంతాల ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఏపీ అసెంబ్లీలో జరిగిన పాలనా వికేంద్రీకరణ బిల్లులో జగన్ ప్రసంగించారు.
అమరావతి: అభివృద్ది చేయని, చేయలేని ప్రాంతంలో చంద్రబాబు అమరావతిలో ఉద్యమాలు చేయిస్తున్నారని ఏపీ సీఎం వైఎస్ జగన్ విమర్శించారు. ఏపీ అసెంబ్లీలో పాలనా వికేంద్రీకరణపై జరిగిన చర్చలో ఏపీ సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. అమరావతిలో రకరకాల డ్రామాలు జరుగుతున్నాయన్నారు. కట్టని రాజధాని గురించి కట్టలేని గ్రాఫిక్స్ గురించి వెయ్యి రోజులుగా కృత్రిమ ఉద్యమాన్ని నడిపిస్తున్నారని చెప్పారు. హైద్రాబాద్ కంటే కూడా కట్టని, కట్టలేని అమరావతి వీరి దృష్టిలో ఎంతో గొప్పదని సీఎం ఎద్దేవాచేశారు.
వీళ్ల దృష్టిలో మాత్రమే అమరావతి ఎందుకు గొప్పదనే దానిపై ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు సీఎం. ఎవరి అభివృద్ది కోసం వీరంతా ఉద్యమాలు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. బీసీ, ఎస్పీ, ఎస్టీ, మైనారిటీ ,పేద ఓసీల కోసం ఉద్యమం చేస్తున్నారా అని సీఎం అడిగారు. పెత్తందారుల స్వంత అభివృద్ది కోసమే ఉద్యమాలు చేస్తున్నారని సీఎం జగన్ మండిపడ్డారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల ప్రజల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా డ్రామా నడుపుతున్నారన్నారు.
2019లో చంద్రబాబునాయుడు సర్కార్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ తమ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ కు సమానంగా ఉందన్నారు. కానీ చంద్రబాబు సర్కార్ ఎందుకు ఎందుకు ప్రజలకు సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టలేదని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో దోచుకో, పంచుకో, తినుకో అనే పద్దతి ఉందన్నారు.
తమ బినామీల భూములున్న ప్రాంతమే రాజధాని కావాలనిచంద్రబాబు అనుకున్నారని జగన్ ఆరోపించారు. ఒకటే రాజధానిగా అమరావతి సాధ్యమయ్యే పనేనా అని ఆయన ప్రశ్నించారు. వ్యవస్థలన్నీ తన వాళ్ల చేతుల్లో ఉండాలనేది పెత్తందారీ మనుషుల మనస్తతత్వమని జగన్ చెప్పారు. విపక్షాల్లో కూడా తన వాళ్లు ఉండాలని వారు కోరుకుంటారన్నారు. ఒక్క రాజధానే కాదు ఏదీ తీసుకున్నా వాళ్ల ఆలోచనలు, డిజైన్లు అన్నీ అలాగే ఉంటాయని పరోక్షంగా చంద్రబాబుపై జగన్ విమర్శలు చేశారు. .అలాంటి డిజైన్లకు అందమైన పేర్లు పెడుతుంటారన్నారు. అలాంటి కుట్రపూరితమైన ఓ డిజైన్ పేరే ఒకటే రాజధానిగా అమరావతి అని సీఎం జగన్ వివరించారు. ఇది నిజనంగా సాధ్యమయ్యే పనేనా అనే విషయాన్ని ఆలోచించాలన్నారు.
అమరావతిపై తనకు ఎలాంటి కోపం లేదని సీఎం జగన్ స్పష్టం చేశారు. ప్రతి ప్రాంతం బాగుపడాలి, అక్కడున్న వాళ్లంతా సంతోషంగా ఉండాలని తాను కోరుకుంటున్నట్టుగా జగన్ తెలిపారు. అమరావతి అనే ప్రాంతం అటు విజయవాడకు, ఇటు గుంటూరుకు దగ్గరగా లేదనే విషయాన్ని గుర్తు చేశారు. అమరావతిలో కనీస సదుపాయాల కల్పన కోసం రూ. 1.10 లక్షల కోట్లు అవసరం అవుతుందన్నారు. ఇక రాజధాని అంటే నాలుగైదు లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని సీఎం చెప్పారు. ఒక వ్యక్తి గ్రాఫిక్స్ చూపించి భ్రమలు కల్పించి మోసం చేస్తే 420 కేసు పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.
అమరావతికి రూ. 1.10 లక్షలు మౌళిక సదుపాయాల కోసం కావాలని చెప్పిన చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో రూ. 5,674 కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు. మరో 2,297 కోట్లు బకాయిలు పెట్టి పోయారన్నారు.ఏ ప్రాంతంలోనైనా ఏడాదికి రూ. 2 వేల కోట్ల కంటే ఎక్కువగా ఖర్చు చేయలేని పరిస్థితిలో రాష్ట్రం ఉందనే విషయాన్ని తెలుసుకోవాలన్నారు. రాష్ట్రంలోని 80 శాతం ప్రజలు తెల్ల రేషన్ కార్డుదారులే ఉన్నారనే విషయాన్ని మర్చిపోవద్దన్నారు. మన అవసరాలు ఏమిటీ, ప్రజలకు చేయాల్సింది ఏమిటీ అనేది నాయకులు ఎప్పుడూ మర్చిపోవద్దన్నారు.
అమరావతిపై లక్షా 10 వేల కోట్లు ఖర్చు చేయాలంటే వందేళ్ల సమయం పడుతుందని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. వందేళ్లలో ఈ ఖర్చు రూ. 20 నుండి రూ. 30 లక్షల కోట్లకు పెరిగే అవకాశం ఉందన్నారు. డబ్బులుంటే ఈ ప్రాంతంలోనే రాజధాని పెట్టేందుకు తాను సిద్దంగా ఉన్నానన్నారు. అమరావతితో పాటు విశాఖపట్టణం, కర్నూల్ లో రాజధానులు కావాలని ప్రకటించిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. అమరావతి నిజంగా సెల్ఫ్ ఫైనాన్స్ రాజధానా అని ప్రజలంతా ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు.