ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతానికి రఘురామకృష్ణంరాజు అంశం హాట్ టాపిక్. ఎప్పటినుండో కూడా వైసీపీకి ఇబ్బందికర వ్యాఖ్యలుచేస్తున్న నర్సాపురం ఎంపీ టీటీడీ వ్యవహారంపై ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసి లైం లైట్ లోకి వచ్చారు. ఆ తరువాత వైసీపీ ప్రజాప్రతినిధులు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని లేపాయి. 

ఇక దీనికి వైసీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. జగన్ బొమ్మ పెట్టుకొని గెలిచావని, ఇలాంటి వ్యాఖ్యలు తగవని సూచించారు. దానికి ఆయన ఫైర్ అవుతూ... తనను కాళ్లావేళ్లా బ్రతిమిలాడితే తాను వైసీపీలో చేరానని, తాను కాబట్టే నరసాపురం సెగ్మెంట్ లో వైసీపీ విజయదుందుభి మోగించిందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తనపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే ప్రసాదరాజుకు కౌంటర్ ఇస్తూ ఈ వ్యాఖ్యలు చేసారు ఫైర్ బ్రాండ్ ఎంపీ. 

ఈ వ్యాఖ్యలతరువాత వైసీపీ నేతలు, ఎంపీ రఘురామ మధ్య మాటల యుద్ధం, సవాళ్లు, ప్రతిసవాళ్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వైసీపీ సీనియర్ నేత మండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు రఘురామకు వార్నింగ్ ఇచ్చారు. 

ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యలను ఖండిస్తున్నామని ఉమ్మారెడ్డి అన్నారు. ఇలాగే మాట్లాడితే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని సీఎం జగన్‌ చెప్పారన్నారు. నాయకులు ఎక్కడా చాలెంజ్‌  చేసుకోవద్దని, పార్టీ ఆదేశం మేరకే ప్రెస్‌మీట్‌లు పెట్టాలన్నారు. 

నరసాపురంలో జరిగిన ఘటనను సీఎం చాలా సీరియ్‌సగా తీసుకున్నారన్నారు. ఎవరు తొందరపడ్డారనే విషయమై సీఎం  పూర్తిస్థాయిలో విచారణ చేయిస్తున్నారని తెలిపారు. రఘురామకృష్ణంరాజు  వ్యవహారాన్ని పార్టీ సీరియ్‌సగా తీసుకుంటుందని సీఎం చెప్పారన్నారు. 

తాను ఇప్పుడు పార్టీపరంగానే ప్రకటన చేస్తున్నానని, రఘురామకృష్ణంరాజు దీనినే  నోటీసుగా పరిగణించాలని, సీఎం జగన్ తనకు అపాయింట్‌మెంట్‌  ఇవ్వడంలేదని ఎంపీ రఘురామ ఆరోపించడం సరైంది కాదు అని ఉమ్మారెడ్డి వ్యాఖ్యానించారు. 

తనను పార్టీలో చేరాలని బతిమిలాడితేనే వైసీపీలోనే చేరానని ఆయన గుర్తు చేశారు. ఎన్నికల ముందు అభ్యర్థులను ప్రకటించే విషయంలో టీడీపీ ఆలస్యం చేసిందన్నారు. 

అంతకుముందు కూడ తనను వైసీపీలో చేరాలని కోరినా కూడ తాను చేరడానికి ఇష్టపడలేదన్నారు. రాష్ట్రం మొత్తం వైసీపీ విజయదుందుభి మోగించినా కూడ నరసాపురం ఎంపీ సెగ్మెంట్‌లో తమకు ఇబ్బంది ఉంటుందని ఆ పార్టీ నాయకత్వం తనకు చెప్పిందన్నారు. తాను వైసీపీలో చేరితే నరసాపురం ఎంపీ సెగ్మెంట్ లో మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని తనకు చెప్పి బతిమిలాడితే తాను వైసీపీలో చేరినట్టుగా ఆయన గుర్తు చేసుకొన్నారు.

నరసాపురం ఎంపీ స్థానంలో తాను కాబట్టే విజయం సాధించినట్టుగా ఆయన బల్లగుద్దిచెబుతున్నట్టుగా ఆయన స్పష్టం చేశారు. జగన్ బొమ్మ చూసి ఓటేస్తేనే తన నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు విజయం సాధించలేదన్నారు. తన ముఖం చూసి కూడ జనం ఓట్లేస్తే ఈ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో వైసీపీ ఎమ్మెల్యేలతో పాటు తాను విజయం సాధించినట్టుగా ఆయన కుండబద్దలుకొట్టారు.