ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు ఉపయోగపడే ముఖ్యమంత్రి సహాయ నిధి సొమ్మును పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించారు కొందరు కేటుగాళ్లు. కోట్లు కొల్లగొట్టేందుకు ప్రయత్నించారు.

అయితే ఆఖరి నిమిషంలో బ్యాంక్ అధికారులు అలెర్ట్ కావడం వల్ల కిలాడీల పాచిక పారలేదు. అనారోగ్యం, ఇతర సమస్యలతో బాధపడుతున్న వారు తమను ఆదుకోవాలంటూ చేసిన విజ్ఞప్తులకు స్పందించి సీఆర్ఎంఫ్ విడుదల చేస్తుంది ప్రభుత్వం.

దీనిని ఆసరాగా తీసుకున్న గుర్తు తెలియని వ్యక్తులు మూడు నకిలీ చెక్కులను తయారు చేశారు. బెంగళూరు సర్కిల్, మంగళూరులోని మూడబిద్రి శాఖకు 52 కోట్ల 65 లక్షలు, ఢిల్లీలోని సీసీబీసీఐకి 39 కోట్ల 86 లక్షలు, కోల్‌కతా సర్కిల్‌లోని ఓగ్‌రాహత్ శాఖకు 24 కోట్ల 65 లక్షల రూపాయల చెక్కులను క్లియరెన్స్ కోసం ఎస్‌బీఐకి పంపారు.

అయితే ఈ మూడు చెక్కులు విజయవాడ ఎంజీ రోడ్ బ్రాంచికు చెందినవి కావడంతో అక్కడికి ఫోన్ చేసి వివరాలు కనుక్కొన్నారు. దీంతో ఈ నకిలీ వ్యవహారం బయటపడింది. ఈ కుంభకోణాన్ని సీరియస్‌గా పరిగణించిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏసీబీ విచారణకు ఆదేశించారు.