ఆరోగ్య శ్రీ సేవలపై ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించే ఉద్దేశంతో సెప్టెంబర్ 15 నుంచి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఏపీ సీఎం వైఎస్ జగన్ తెలిపారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖపై గురువారం సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు.
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖపై గురువారం సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఆసుపత్రుల నిర్వహణకు నిధుల సమస్యల తలెత్తకుండా చూడాలన్నారు. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు, హాస్పిటల్స్ నిర్వహణ అత్యున్నత స్థాయిలో లోపరహితంగా వుండాలని సీఎం ఆదేశించారు. ఆయా విద్యా సంస్థలకు ప్రభుత్వం ఇచ్చే ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల్లోంచే కొంత సొమ్మును ఆ సంస్థల నిర్వహణకు ఉపయోగించేలా వుండాలన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రులు, మెడికల్ కాలేజీల నిర్వహణకు నిధుల సమస్యల ఉత్పన్నం కాకూడదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ విద్యా సంవత్సరంలో రాజమండ్రి, నంద్యాల, ఏలూరు, విజయనగరం, మచిలీపట్నంలోని మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు నిర్వహిస్తారని.. పులివెందుల , పాడేరు, ఆదోనీ, మదనపల్లె, మార్కాపురంలోని వైద్య కళాశాలల్లో మాత్రం వచ్చే ఏడాది నుంచి ప్రవేశాలు వుంటాయని ముఖ్యమంత్రి చెప్పారు.
ALso Read: అధికారమంటే అజమాయిషీ కాదు: 2.62 లక్షల మంది ఖాతాల్లో నగదు జమ చేసిన జగన్
ఆరోగ్య శ్రీ సేవలపై ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించే ఉద్దేశంతో సెప్టెంబర్ 15 నుంచి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జగన్ తెలిపారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని సీఎం ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజినీ, సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ ఎం.టీ కృష్ణబాబు, తదితర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
