ఆనందయ్య కరోనా మందు... సీఎం జగన్ కీలక సమావేశం (వీడియో)
ఆనందయ్య అందించే ఆయుర్వేదిక మందు కరోనాను క్షణాల్లో నయం చేస్తుందన్న ప్రచారం జరగడంతో ఇరు తెలుగు రాష్ట్రాల నుండే కాదు ఇతర రాష్ట్రాల నుండి కూడా ప్రజలు కృష్ణపట్నం బాట పట్టారు.
నెల్లూరు: కరోనా వైరస్ సోకి ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే అయ్యో పాపం అనడం తప్ప ఎవ్వరూ ఏం చేయలేకపోయారు. కానీ నెల్లూరు జిల్లాకు చెందిన బొనిగి ఆనందయ్య మాత్రం తనకు తెలిసిన ఆయుర్వేదాన్ని ఉపయోగించి ఓ మందుకు తయారుచేశారు. ఈ మందు కరోనాను క్షణాల్లో నయం చేస్తుందన్న ప్రచారం జరగడంతో ఇరు తెలుగు రాష్ట్రాల నుండే కాదు ఇతర రాష్ట్రాల నుండి కూడా ప్రజలు కృష్ణపట్నం బాట పట్టారు.
అయితే ఈ మందు పంపిణీపై సందిగ్ధత నెలకొంది. దీనికి అనుమతి ఇవ్వాలా? వద్దా? అనే అంశంపై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ ఈ మందు గురించి తెలుసుకునేందుకు సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటుచేశారు. అధికారులతో సమావేశమై ఆయుర్వేదం మందు శాస్త్రీయత, పనిచేసే విధానం గురించి సీఎం తెలుసుకోనున్నారు.
read more ఆనందయ్య కరోనా మందు పంపిణీ నిలిపివేత.. రెండు రోజుల వరకు లేనట్టే...
ఆనందయ్య అందిస్తున్న కరోనా మందుపై ఇప్పటికే అధికారుల బృందం చేసిన పరిశీలన, నివేదికపై ముఖ్యమంత్రి చర్చించనున్నారు. అన్ని అంశాలను కూలంకశంగా చర్చించిన అనంతరం పంపిణీపై సీఎం కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఒకవేళ పంపిణీకి అనుమతిస్తే ప్రభుత్వపరంగా చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించి ఆదేశాలివ్వనున్నారు.
ఇదిలావుంటే నేటి(శుక్రవారం) నుండి ఆనందయ్య మందు పంపిణీ తిరిగి ప్రారంభం కానుందంటూ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ ప్రకటనతో ప్రజలు భారీగా కృష్ణపట్నంకు వస్తున్నారు. దీంతో వేలాది వాహనాలతో నెల్లూరు-కృష్ణపట్నం రోడ్డు కిక్కిరిసిపోయింది. పెద్ద సంఖ్యలో ప్రజలు రావడంతో క్యూలైన్లలో స్వల్ప తోపులాట చోటు చేసుకుంది.