అమరావతి: బిజెపితో సంబంధాలపై తన వైఖరిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైఎస్ జగన్ వెల్లడించారు. హిందూస్థాన్ టైమ్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ పార్టీ బిజెపితో ఏ విధమైన సంబంధాలను కొనసాగిస్తుందనే విషయాన్ని వెల్లడించారు. తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, అదే మార్గంలో వెళ్తామని ఆయన చెప్పారు.  ప్రతి అంశంలోనూ తాము అదే విధంగా వ్యవహరిస్తామని చెప్పారు. 

ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులోనైనా ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందని తాము విశ్వసిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ విషయంపై తాము పూర్తి ఆశావహ దృక్పథంతో ఉన్నట్లు తెలిపారు. బిజెపికి తాము అంశాలవారీగా మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. తమ ఏ కొంచెం మద్దతు ఇచ్చినా కూడా అన్ని విధాలుగా రాష్ట్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే చేస్తున్నామని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత  నష్టపోయిన తమ రాష్ట్రాన్ని పునర్నిర్మించుకునే పనిలో ఉన్నామని ఆయన అన్నారు. 

Also Read: అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారమే: చంద్రబాబుపై జగన్ తీవ్ర వ్యాఖ్యలు

కాంగ్రెసుపై అడిగిన ప్రశ్నలకు ఆయన సూటిగా సమాధానం చెప్పలేదు. మీరు గతంలో ఉండిన కాంగ్రెసు పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేయాలని వచ్చిన డిమాండ్లను మీరు ఎలా చూస్తున్నారని, గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తి లేకుండా అది మనగలుగుతుందని భావిస్తున్నారా అని హిందూస్థాన్ టైమ్స్ ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఆయన స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. 

తమది ఆంధ్రలో బలమైన ప్రాంతీయ పార్టీ అని, జాతీయ స్థాయి రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయిలో తమకు సంఖ్యా బలం లేదని జగన్ చెప్పారు. తమది లోకసభలో నాలుగో అతి పెద్ద పార్టీ అని ఆయన చెప్పారు. విభజన వల్ల జరిగిన నష్టం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అబివృద్ధి చేసుకోవడం వరకే తమ పాత్ర పరిమితమవుతుందని ఆయన చెప్పారు. రాష్ట్రాన్ని పునర్నిర్మించుకునే ప్రక్రియలో ఉన్నామని, జాతీయ రాజకీయాలపై ఆసక్తి లేదని ఆయన చెప్పారు.