అమరావతి: మూడు రాజధానులపై తన వైఖరిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పునరుద్ఘాటించారు. తాము మూడు రాజధానుల ఏర్పాటుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే విధానానికి తాము కట్టుబడి ఉన్నట్లు, అందుకే మూడు రాజధానులను ప్రతిపాదించినట్లు ఆయన తెలిపారు. హిందూస్థాన్ టైమ్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాల గురించి మాట్లాడారు. 

అమరావతిలో జరిగింది రియల్ ఎస్టేట్ వ్యాపారం మాత్రమేనని, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తానూ తన మనుషులూ భూములు కొనుగోలు చేసిన చోట అభివృద్ధి చేయాలని చెప్తే ఎలాగని ఆయన అన్నారు. మూడు రాజధానులు అనేది ఓ సామాన్యుడి ఆలోచన అని, రాజధాని విధులను విభజిస్తున్నామని ఆయన చెప్పారు. కేంద్రం ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ కూడా రాజధాని విధులు విభిన్న ప్రాంతాల నుంచి జరగవచ్చునని చెప్పిందని ఆయన గుర్తు చేశారు. 

అన్ని విధులు ఒక్క చోటి నుంచి ఎందుకు నిర్వహించాలని ఆయన అడిగారు. చెన్నై, హైదరాబాదు నగరాల్లో విధులన్నింటినీ కేంద్రీకరించడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు సార్లు తీవ్రంగా నష్టపోయిందని ఆయన అన్నారు. అన్ని గుడ్లు కూడా ఒకే బుట్టలో నష్టపోతారని చరిత్ర కూడా చెబుతోందని ఆయన అన్నారు. గత అనుభవాలను పరిగణనలోకి తీసుకోకుండా ఇంకా అదే విధానాన్ని ఎందుకు కొనసాగించాలని ఆయన అడిగారు. 

హైదరాబాదులోని మాదాపూర్ లో 1990 ప్రాంతంలో జరిగిన ఇన్ సైడర్ ట్రేడింగ్ విధానమే మళ్లీ గత టీడీపీ పాలనలో అమరావతిలో జరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. రాజధాని నిర్మాణానికి రైతుల నుంచి సేకరించిన, సమీకరించిన 33 వేల ఎకరాల భూమిలో మెగా భవన నిర్మాణాలకు ఏ మాత్రం అనువుగా లేనిచోట ఒక నగరాన్ని నిర్మించడం కన్నా చంద్రబాబు 500 ఎకరాల్లో మరో చోట నిర్మాణానికి ప్రయత్నించి ఉండవచ్చునని ఆయన అన్నారు. 

అమరావతిలో జరిగిన భూ లావాదేవీలపై ప్రత్యేక బృందం దర్యాప్తు చేస్తోందని, తనకు ముందున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన మనుషుల బినామీ లావాదేవీలను బయటకు తీసే పనిలో ఉందని, ఆ ప్రాంతంలో స్వప్రయోజనాలను ఆశించి పబ్బం గడుపుకోవాలని కొందరు వ్యక్తులు పేద రైతుల నుంచి భూములను కొనుగోలు చేశారని, ఆ తర్వాతనే అక్కడ రాజధానిని పెడుతున్నట్లు ప్రకటన వచ్చిందని, కారు చౌకకు భూములు కొనుగోలు చేసినవారు వేలాది కోట్ల రూపాయల ప్రయోజనం పొందారని ఆయన అన్నారు. 

అమరావతి కేవలం ఒక వర్గానికి ప్రయోజనం చేకూర్చడానికి గత ప్రభుత్వం చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్పమరోటి కాదని జగన్ అన్నారు. అభివృద్ధి ఒకే చోట కాకుండా దాన్ని వికేంద్రీకరించి రాష్ట్రమంతటికీ విస్తరింప జేస్తే అన్ని ప్రాంతాలు సమీప భవిష్యత్తులో గ్రోత్ సెంటర్లుగా మారుతాయని ఆయన అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరిగితే విశాఖపట్నం, అనంతపురం, కర్నూలు, తిరుపతి, తదితర నగరాలు అభివృద్ధి క్లస్టర్లుగా ఉంటాయని ఆయన చెప్పారు. 

మెగా సిటీలనేవి అవాంఛనీయమని జగన్ అన్నారు. వాటికి అన్ని రకాల వనరులు అధికంగా అవసరమవుతాయని, పైగా ప్రజలకు పెను బారంగా పరిణమిస్తాయని ఆయన అన్నారు. 

చంద్రబాబు చేస్తున్న గూఢచర్యం అనే ఆరోపణ పూర్తిగా అర్థరహితమైందని ఆయన అన్నారు. ఇందుకు సంబంధించి ఏవైనా ఆధారాలుంటే ఇవ్వాలని స్వయంగా డీజీపీ ప్రతిపక్షాన్ని అడిగారని, వారు ఏ విధమైన సాక్ష్యాలను కూడా చూపలేకపోయారని ఆయన అన్నారు. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమ పార్టీ సీనియర్ నేతల ఫోన్లను ట్యాప్ చేశారని, ఇందుకు సంబందించిన సాక్ష్యాధారాలను తాము చూపించామని ఆయన అన్నారు.