ఎప్పటినుండో నిరసన గళం వినిపిస్తున్న నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు మరోసారి తీవ్రంగా ఫైర్ అయిన విషయం తెలిసిందే. తనను కాళ్లావేళ్లా బ్రతిమిలాడితే తాను వైసీపీలో చేరానని, తాను కాబట్టే నరసాపురం సెగ్మెంట్ లో వైసీపీ విజయదుందుభి మోగించిందని అన్నారు. తనపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే ప్రసాదరాజుకు కౌంటర్ ఇస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు. 

రఘురామకృష్ణం రాజు చేస్తున్న వ్యాఖ్యలపై వైసీపీ అధిష్టానం సీరియస్ అవుతున్నట్టుగా తెలియవస్తుంది. ఆయన వ్యాఖ్యలపై చర్యలు తీసుకునే యోచనలో ఉన్నట్టు సమాచారం. ఆయన గత కొంత కాలంగా ఇసుక, ల్యాండ్ మాఫియాలో జరుగుతున్న అవినీతిపై తనస్వరాన్ని వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రఘురామ కృష్ణంరాజు కు షూ కాజ్ నోటీసు జారీ చేయాలనీ యోచిస్తున్నట్టు తెలియవస్తుంది. 

ఈసారి జగన్ నిర్ణయం ఎంత సీరియస్ గా ఉండబోతుందంటే... రఘురామకృష్ణమరాజు గనుక షో కాజ్ నోటీసులకు సరైన రీతిలో స్పందించకపోతే... ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసేందుకు కూడా వెనుకాడబోమన్న సంకేతాలను ఇవ్వనున్నట్టు తెలియవస్తుంది. 

ఇకపోతే... పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు నరసాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజు వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. తనపై విమర్శలు చేసిన ప్రసాదరాజుకు త్వరలోనే మంత్రి పదవి వస్తోందని ఆయన జోస్యం చెప్పారు.

ప్రసాదరాజుకు మంత్రి పదవి రావాలని కోరుకొంటున్నట్టుగా ఆయన చెప్పారు. తనను పార్టీలో చేరాలని బతిమిలాడితేనే వైసీపీలోనే చేరానని ఆయన గుర్తు చేశారు. ఎన్నికల ముందు అభ్యర్థులను ప్రకటించే విషయంలో టీడీపీ ఆలస్యం చేసిందన్నారు. 

అంతకుముందు కూడ తనను వైసీపీలో చేరాలని కోరినా కూడ తాను చేరడానికి ఇష్టపడలేదన్నారు. రాష్ట్రం మొత్తం వైసీపీ విజయదుందుభి మోగించినా కూడ నరసాపురం ఎంపీ సెగ్మెంట్‌లో తమకు ఇబ్బంది ఉంటుందని ఆ పార్టీ నాయకత్వం తనకు చెప్పిందన్నారు. తాను వైసీపీలో చేరితే నరసాపురం ఎంపీ సెగ్మెంట్ లో మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని తనకు చెప్పి బతిమిలాడితే తాను వైసీపీలో చేరినట్టుగా ఆయన గుర్తు చేసుకొన్నారు.

నరసాపురం ఎంపీ స్థానంలో తాను కాబట్టే విజయం సాధించినట్టుగా ఆయన బల్లగుద్దిచెబుతున్నట్టుగా ఆయన స్పష్టం చేశారు. జగన్ బొమ్మ చూసి ఓటేస్తేనే తన నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు విజయం సాధించలేదన్నారు. తన ముఖం చూసి కూడ జనం ఓట్లేస్తే ఈ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో వైసీపీ ఎమ్మెల్యేలతో పాటు తాను విజయం సాధించినట్టుగా ఆయన కుండబద్దలుకొట్టారు. 

పార్లమెంట్‌లో ఆయా పార్టీలకు ఉన్న సభ్యులను బట్టి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో అవకాశమిస్తారని చెప్పారు. వైసీపీకి కేవలం ఒక్క పదవే దక్కుతోందన్నారు.వేరే పార్టీకి చెందాల్సిన కోటాలో తనకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఛైర్మెన్ పదవిని ఇచ్చారని రఘురామకృష్ణంరాజు వివరించారు.

ఈ పదవిని ఇవ్వడానికి వైసీపీ అధిష్టానం ప్రమేయం లేదని ఆయన తేల్చి చెప్పారు. కరోనా నేపథ్యంలో పోలీసులు కూడ తనను నియోజకవర్గానికి రాకూడదని కోరినట్టుగా చెప్పారు.హైద్రాబాద్‌లోనే ఉంటూ ప్రజలకు చేయాల్సిన సేవను తాను చేస్తున్నట్టుగా చెప్పారు. 

ఎమ్మెల్యే ప్రసాదరాజుతో ఎవరు మాట్లాడించారో తనకు తెలుసునని చెప్పారు. రాష్ట్రంలో చోటు చేసుకొన్న పరిణామాలతో పాటు పలు విషయాలపై చర్చించేందుకు తాను ముఖ్యమంత్రిని కలవాలని ప్రయత్నిస్తోంటే ఇంతవరకు అపాయింట్ మెంట్ దొరకలేదని ఆయన వ్యాఖ్యలు చేశారు. రెండు మూడు రోజులుగా పలు తెలుగు న్యూస్ ఛానెల్స్ ఇంటర్వ్యూల్లో పాల్గొన్న రఘురామకృష్ణంరాజు ఈ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.