అమరావతి: పీపీఏల విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వెనక్కి తగ్గడం లేదు. పీపీఏల పున:సమీక్షను విరమించుకోవాలని కేంద్రం కోరినప్పటికీ జగన్ మాత్రం తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. 

కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పీపీఏల పున: సమీక్ష అంశాన్ని పునరాలోచించుకోవాలంటూ లేఖలు సైతం రాసింది. ఈ పంచాయితీ ప్రధాని నరేంద్రమోదీ వద్దకు సైతం చేరింది. కేంద్రం వద్దని వారించినప్పటకీ సీఎం జగన్ మాత్రం వెనకడుగు వేయడం లేదు. పీపీఏలో తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తేల్చి చెప్తున్నారు.

మరోవైపు న్యాయస్థానాలు సైతం జగన్ ప్రభుత్వంపై ప్రత్యక్షంగా మెుట్టికాయలు వేయకపోయినప్పటికీ అన్నింటిపైనా స్టేలు విధించింది. అటు జగన్ నియమించిన కమిటీ భేటీపై స్టే విధించడంతోపాటు ఏపీఈపీడీసీఎల్ రాసిన లేఖలను సైతం సస్పెండ్ చేసింది.

అటు అప్పిలేట్ ట్రిబ్యునల్ కూడా జగన్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. విద్యుత్ పంపిణీ సంస్థలకు ప్రభుత్వం ఇచ్చిన నోటీసులపై స్టే విధించింది. గతంలో ఇచ్చిన నోటీసులు పరిశీలనలో ఉన్న దృష్ట్యా ప్రస్తుతం జగన్ ప్రభుత్వం విడుదల చేసిన నోటీసులపై స్టే విధిస్తూ నిర్ణయం తీసుకుంది. 

తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు సీఎం జగన్. విండ్, సోలార్ కంపెనీల నుంచి విద్యుత్ ను తీసుకోవడాన్ని నిలిపివేశారు. బ్యాక్ డౌన్ తరహాలో విద్యుత్ ను తీసుకునే ప్రక్రియను నిలిపివేసింది జగన్ ప్రభుత్వం. 

పగటిపూట సౌర విద్యుత్ ను తీసుకోవడాన్ని నిలిపివేసింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై యాక్సిస్ ఎనర్జీ సంస్థ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. పిటీషన్ ను స్వీకరించిన హైకోర్టు, విచారణ ఎల్లుండికి వాయిదాసింది.  

ఇకపోతే పీపీఏల పున:సమీక్షకు సంబంధించి ఏపీఎస్పీడీసీఎల్ రాసిన లేఖలను నాలుగు వారాల పాటు సస్పెండ్ చేసింది హైకోర్టు. అలాగే పీపీఏల పున: సమీక్షకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి సంప్రదింపుల కమిటీపై నాలుగు వారాలపాటు స్టే విధించింది. 
 
పీపీఏలను పున:సమీక్షించాలని వైయస్ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో 40 ప్రైవేట్ విద్యుత్ సంస్థలు హైకోర్టును ఆశ్రయించాయి. పీపీఏలపై సమీక్ష కోసం ఉన్నతస్థాయి సంప్రదింపుల కమిటీని నియమిస్తూ విడుదల చేసిన జీవో 63ను రద్దు చేయాలని కోరాయి. కాంపిటేటివ్ పద్దతిలోనే తాము బిడ్డింగ్ దక్కించుకున్నట్లు సంస్థలు స్పష్టం చేశాయి. 

ఏపీ రెగ్యులరేటరీ, ఏపీ ఈఆర్సీ ఆమోదంతోనే బిడ్డింగ్ డిస్కంలతో ఒప్పందం చేసుకున్నామని విద్యుత్ పంపిణీ సంస్థలు స్పష్టం చేశాయి. గతంలో చెల్లించిన బిల్లులను పున: సమీక్షించాలని ప్రభుత్వం నిర్ణయించుకోవడం ఏకపక్షమని విద్యుత్ సంస్థలు హైకోర్టులో తమ వాదనలు వినిపించాయి. 

బిల్లులను పున:సమీక్షించే అధికారం కేవలం డిస్కింలకు మాత్రమే ఉంటుందని విద్యుత్ పంపిణీ సంస్థలు హైకోర్టులో తమ వాదనలు వినిపించాయి. 40 విద్యుత్ పంపిణీ సంస్థలు సుమారు 15 పిటీషన్లను దాఖలు చేయగా ఇటీవలే వాటిపై జస్టిస్ ఎం.గంగారావ్ విచారణ చేపట్టారు. 

విద్యుత్ పంపిణీ సంస్థల వాదనలు విన్న హైకోర్టు పీపీఏల పున:సమీక్షించుకోవాలన్న ప్రభుత్వ తీరు ఆక్షేపనీయంగా ఉందంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తూ తీర్పును ఆగష్టు 22కు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. 

ఇదిలా ఉంటే విద్యుత్ కొనుగోలు విషయంలో పీపీఏలను పున: సమీక్షించాలన్న ఏపీ ప్రభుత్వానికి అప్పిలేట్ ట్రిబ్యునల్ కూడా షాకిచ్చింది. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన నోటీసులపై గ్రీన్ కో ఎనర్జీ గ్రూప్ కంపెనీ అప్పిలేట్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించగా ఏపీ ప్రభుత్వం ఈఏడాది జూలై 12న జారీ చేసిన మూడు నోటీసులపై స్టే విధించింది. 

మెుత్తం పీపీఏల అంశం సీఎం వైయస్ జగన్ ను ఇరకాటంలో నెట్టేస్తోంది. అటు కేంద్రం పున:సమీక్షను విరమించుకోవాలని సూచించినా, హైకోర్టులు సైతం స్టే విధించినా సీఎం వైయస్ జగన్ మాత్రం పీపీఏల అంశంపై దూకుడుగానే ఉన్నారు. 

తాజాగా పలు విద్యుత్ పంపిణీ సంస్థల నుంచి సోలార్, విండ్ పవర్ ను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. జగన్ నిర్ణయంపై అటు కేంద్రం, న్యాయ స్థానాలు ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాలి. 

ఈ వార్తలు కూడా చదవండి

సోలార్, విండ్ కంపెనీల నుంచి విద్యుత్ నిలిపివేత: సీఎం జగన్ సంచలన నిర్ణయం

హైకోర్టులో జగన్ సర్కార్ కు చుక్కెదురు: పీపీఏల పున:సమీక్షకు బ్రేక్

జగన్ సర్కార్ కు అప్పిలేట్ ట్రిబ్యునల్ షాక్