అమరావతి:విశాఖ సమీపంలోని పరవాడలో సాయినార్‌ లైఫ్‌ సెన్సైస్‌ ఫార్మా కంపెనీలో ప్రమాదంపైవైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరా తీశారు. సీఎంఓ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటనలో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే ఇద్దరు మరణించారని, మరో నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. 

ఒకరు వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారని, మరో ముగ్గురు సురక్షితంగా ఉన్నారని వెల్లడించారు. రియాక్టర్‌ వద్ద లీకేజీ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. రాత్రి 11:30 గంటలకు ప్రమాదం జరిగిందని, తమ దృష్టికి వచ్చిన వెంటనే ఫ్యాక్టరీ ప్రాంతానికి జిల్లాకలెక్టర్, సీపీ చేరుకున్నారని వివరించారు. ముందుజాగ్రత్తగా ఫ్యాక్టరీని షట్‌డౌన్‌ చేయించారని, ప్రమాదం ఫ్యాక్టరీలో ఓ రియాక్టర్‌ ఉన్న విభాగానికి పరిమితమని ఎలాంటి ఆందోళన అవసరంలేదని అధికారులు నివేదించారు. 

Also Read: విశాఖలో మరో గ్యాస్ లీక్, ఇద్దరి మృతి, నలుగురు విషమం

బాధితులను కలెక్టర్‌ వినయ్, , విశాఖ సిటీ పోలీస్‌ కమిషనర్‌ మీనా పరామర్శించారని తెలిపారు. ఈఘటనపై విచారణకూడాచేయిస్తున్నట్టు కలెక్టర్‌ వెల్లడించారన్నారు. 
 ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారికి మెరుగైన సౌకర్యాలు అందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

నారా లోకేష్ స్పందన

విశాఖ ఫార్మా కంపెనీ సాయినార్ కెమికల్స్ గ్యాస్ లీకేజ్ ప్రమాదంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన మరవకముందే మరో ఘటన జరగటం దురదృష్టకరమని ఆయన అన్నారు. మృతులకు సంతాపం వ్యక్తం చేసారు. మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. 

గ్యాస్ లీకేజ్ ప్రమాద బాధితులకుమెరుగైన వైద్యం అందించాలని, ఘటన పై సమగ్ర దర్యాప్తు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.