విశాఖలో మరో గ్యాస్ లీక్. పరవాడ ఫార్మా సిటీలోని సాయినార్ లైఫ్ సైన్సెస్ కంపెనీలో జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. వీరికి ప్రస్తుతానికి  చికిత్స అందిస్తున్నారు. 

విశాఖలో స్టైరిన్ గ్యాస్ లీక్ ఘటన మనం మరువక ముందే విశాఖలో మరో గ్యాస్ లీక్ సంఘటన చోటు చేసుకుంది. బెంజిమిడజోల్ గ్యాస్ లీక్ అవడంతో ఈ ఘటన జరిగింది. 

మృతులు షిఫ్ట్ ఇంచార్జి గౌరీ శంకర్, నరేంద్ర గా గుర్తించారు. జానకిరామ్,చంద్రశేఖర్, ఆనంద్ బాబు, సూర్యనారాయణ అస్వస్ధతతో చికిత్స పొందుతున్నారు. చంద్రశేఖర్ పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆసుపత్రిలోని అందరికి వెంటిలేటర్ ద్వారా చికిత్స అందిస్తున్నట్టుగా తెలియవస్తుంది. ప్రమాదం జరిగినప్పుడు 30 మంది కార్మికులు అక్కడ పనిచేస్తున్నట్టు సమాచారం. 

ఇద్దరు షిఫ్ట్ ఇంచార్జి లను కాపాడే క్రమంలో హెల్పర్ చంద్రశేఖర్ అధికంగా గ్యాస్ పీల్చినట్టుగా తెలియవస్తుంది. ఆయన పరిస్థితి ఇప్పుడు విషమంగా ఉన్నట్టుగా చెబుతున్నారు. దీనివల్ల చుట్టుపక్కల ఉన్నవారికి ఎటువంటి ప్రమాదం లేదని సైంటిస్టులు అంటున్నారు. 

విశాఖలో స్టైరిన్ గ్యాస్ లీక్ ఘటనను ఇంకా అక్కడి ప్రజలు పూర్తిగా మరిచిపోకముందే ఇప్పుడు ఈ గ్యాస్ లీకేజితో తీవ్ర భయాందోళనలకు లోనవుతున్నారు. రక్షణ చర్యలు పాటించకుండా నడుపుతున్న కంపెనీలను వెంటనే మూసేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. 

ఇకపోతే ఈ  బెంజిమిడజోల్ వాయువు స్టైరిన్ గ్యాస్ అంత తీవ్రమైనది కాదని, దీనివల్ల చుట్టుపక్కల ప్రజలకు వచ్చిన నష్టం ఏమీలేదని స్టైరిన్ అంత విషవాయువు కాదని, ఆ స్థాయిలో వ్యాపించదని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని నిపుణులు అంటున్నారు.