అమరావతి: తన అద్బుత నటనతోనే కాకుండా మంచి టైమింగ్ తో రాయలసీమ యాసను ఉపయోగిస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న జయప్రకాష్ రెడ్డి మంగళవారం ఉదయం మృత్యువాతపడ్డారు. విలక్షణ నటుడి హఠాన్మరణం టాలీవుడ్‌లోనే కాకుండా ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన అకాల మరణంపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 
 
''జయప్రకాశ్ రెడ్డి అకాల మరణంతో ఇవాళ తెలుగు సినిమా, థియేటర్ నేడు ఒక రత్నాన్ని కోల్పోయాయి.  కొన్ని దశాబ్దాలుగా సాగిన ఆయన సినీజీవితంలో అద్భుతమైన నటనతో, బహుముఖ ప్రదర్శనలతో ఎన్నో మధురమైన, మరపురాని జ్ఞాపకాలను మూటగట్టుకున్నారు. ఆయన అకాల మృతిపట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ కుటుంబసభ్యులకు సానుభూతిని ప్రకటిస్తున్నా'' అంటూ ఏపీ సీఎం జగన్ పేరిట ఓ ప్రకటన విడుదలయ్యింది. 

సినీ నటుడు జయప్రకాశ్ రెడ్డి మృతిపట్ల మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగు నాటకరంగానికి, చలన చిత్రరంగానికి జయప్రకాశ్ రెడ్డి ఎనలేని సేవలు అందించారని.... వందకు పైగా సినిమాల్లో నటించారని గుర్తుచేశారు.  తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఆయన నటించారన్నారు. 
జయప్రకాశ్ రెడ్డి మృతి తెలుగు చలనచిత్ర రంగానికి తీరనిలోటని...మరీ ముఖ్యంగా తెలుగు నాటకరంగం పెద్దదిక్కును కోల్పోయిందన్నారు. జయప్రకాశ్ రెడ్డి అభిమానులకు, కుటుంబ సభ్యులకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చంద్రబాబు ప్రకటించారు. 

 

మంగళవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో జయప్రకాష్ రెడ్డి తన ఇంట్లోనే గుండెపోటు గురయి తుది శ్వాస విడిచారు. ఉదయం బాత్రూంలోనే ఆయన కుప్పకూలిపోయినట్లు తెలుస్తోంది.దీన్ని గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించేలోగానే ఆయన మరణించారు.