బీజేపీ నేత, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు మృతి పట్ల ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు జగన్ సంతాపం తెలియజేశారు.

పైడికొండల ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లుగా చెప్పారు. మాణిక్యాలరావు అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించాల్సిందిగా పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌ను సీఎం ఆదేశించారు. 

పాజిటివ్‌గా తేలడంతో గత నెల రోజులుగా విజయవాడలోని ఓ ఆసుపత్రిలో మాణిక్యాల రావు చికిత్స పొందుతున్నారు. శనివారం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో తుదిశ్వాస విడిచారు. ఫోటోగ్రాఫర్‌గా కెరీర్ ప్రారంభించిన మాణిక్యాల రావు రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. 

2014లో బీజేపీ తరపున తాడేపల్లిగూడెం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన మాణిక్యాల రావు.. చంద్రబాబు నాయుడు కేబినెట్‌లో దేవాదాయ శాఖ మంత్రిగా నియమితులయ్యారు. తొలి ప్రయత్నంలోనే ఆయన మంత్రిగా పదవి పొందడం విశేషం. 

కాగా తనకు కరోనా వచ్చిందని మాణిక్యాల రావు జూలై 4న స్వయంగా వెల్లడించారు. ఇటీవల పాజిటివ్‌గా నిర్థారణ అయిన మాజీ మున్సిపల్ ఛైర్మన్, బీజేపీ నేతతో సహా కాంటాక్ట్ వున్న వాళ్లకి పరీక్షలు  నిర్వహించగా పాజిటివ్‌గా తేలిందన్నారు. మాణిక్యాల రావు మరణంతో ఏపీ బీజేపీ శ్రేణులు విషాదంలో మునిగిపోయాయి. ఆయన ఆత్మకు శాంతి కలగాలని పలువురు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియజేస్తున్నారు.