న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రప్రభుత్వం పూర్తిసహాయ సహకారాలు అందిస్తుందని ప్రధాని నరేంద్రమోదీ స్పష్టం చేశారు. నరేంద్రమోదీతో ఏపీ సీఎం వైయస్ జగన్ శనివారం భేటీ అయ్యారు. సుమారు గంటన్నరపాటు రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై సీఎం జగన్ మోదీతో చర్చించారు. 

రాష్ట్రంలో నెలకొన్న సమస్యలు, పోలవరం రివర్స్ టెండరింగ్, విభజన హామీలు వంటి అంశాలపై సీఎం జగన్ ప్రధానితో చర్చించారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులను విడుదల చేయాలని మోదీని కోరారు సీఎం జగన్.

అలాగే వైసీపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోతున్న వైయస్ఆర్ రైతు భరోసా పథకం ప్రారంభోత్సవానికి హాజరుకావాలని కోరారు. ఈనెల 15న ప్రభుత్వం అమలు చేయబోతున్న ఈ పథకాన్ని ప్రారంభించాలని వేడుకున్నారు. 

వైయస్ఆర్ రైతు భరోసా పథకం కింద రాష్ట్రంలో 50 లక్షల మందికి 5వేల 500కోట్ల రూపాయలను జమచేయనున్నట్లు ప్రధానికి జగన్ వివరించారు. ఈ బృహత్తర కార్యక్రమానికి సహకరించాలని కోరారు. రైతు భరోసా పథకంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. 

ఇకపోతే పోలవరం ప్రాజెక్టు, రివర్స్ టెండరింగ్ పై ప్రధాని మోదీ ఆరా తీసినట్లు తెలుస్తోంది. పోలవరం రివర్స్ టెండరింగ్ ప్రక్రియ ద్వారా రూ.800 కోట్లు ఆదా చేసినట్లు ప్రధానికి జగన్ వివరించారు. అలాగే ఆర్థికమాంద్యం నేపథ్యంలో రాష్ట్రంలో ఆర్థిక సమస్యలు నెలకొన్నాయని తమను ఆదుకోవాలని కోరారు. 

ఎన్నికల ప్రచారంలో వైసీపీ ఇచ్చిన హామీలు, నవరత్నాల పథకాలపై ప్రధాని నరేంద్రమోదీతో చర్చించారు. నవరత్నాల పథకాల ద్వారా ప్రజలకు అందే సేవలపై కూడా చర్చించారు. అలాగే ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న విభజన సమస్యలపై కూడా చర్చించారు. దానితోపాటు నదుల అనుసంధానానికి పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి సహకరించాలని జగన్ కోరారు. 

కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగంపై కూడా ప్రత్యేకంగా చర్చించారు సీఎం జగన్. నదుల అనుసంధానం ద్వారా ఏపీలోని రాయలసీమ ప్రాంతాలతోపాటు తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో తాగు, సాగునీరు అందుతుందని చెప్పుకొచ్చారు. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ డిమాండ్లపై ప్రధాని నరేంద్రమోదీ సానుకూలంగా స్పందించారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు సహకరిస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చినట్లు సమాచారం.    

ఈ వార్తలు కూడా చదవండి

నరేంద్రమోదీతో సీఎం జగన్ భేటీ