అమరావతి:ఏపీ సీఎం వైఎస్ జగన్ శుక్రవారం నాడు సాయంత్రం ఢిల్లీకి బయలుదేరారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులను జగన్  కలిసే అవకాశం ఉంది.

శుక్రవారం నాడు సాయంత్రం ఆరు గంటలకు జగన్ ఢిల్లీకి చేరుకొంటారు.  శుక్రవారం రాత్రికే జగన్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా‌ను కలిసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇవాళ రాత్రి సాధ్యం కాకపోతే ఈ నెల 15వ తేదీన అమిత్ షా‌ను కలుస్తారు.

ఏపీ సీఎం వైఎస్ జగన్ రెండు రోజుల క్రితం ప్రధానమంత్రి మోడీని కలిశారు. సుధీర్ఘంగా మోడీతో సమావేశమయ్యారు.రాష్ట్రానికి చెందిన 11 అంశాలపై మోడీకి  సీఎం జగన్ వినతి పత్రం సమర్పించారు.

ఇవాళ మరోసారి జగన్ ఢిల్లీకి వెళ్లారు. మోడీతో సమావేశానికి కొనసాగింపుగానే అమిత్ షాతో జగన్ సమావేశం జరుగుతోందని ప్రచారం సాగుతోంది. ఏపీ రాష్ట్రంలో ఇటీవల కాలంలో ఐటీ అధికారుల సోదాల నేపథ్యంలో టీడీపీ నేతలకు లింకులున్నాయని వైసీపీ తీవ్రంగా ఆరోపణలు చేస్తోంది.

మూడు రోజుల క్రితం ఢిల్లీకి వచ్చిన సమయంలోనే  అమిత్ షాను కలవాలని జగన్ భావించారు. కానీ, అమిత్ షా అపాయింట్‌మెంట్ దొరకలేదు. దీంతో జగన్ ఇవాళ ఢిల్లీకి వెళ్లారు. ఇవాళ రాత్రికి జగన్ ఢిల్లీలోనే ఉంటారు.